BRS
BRS: ‘మోదీ ఒక దొంగ.. ఆయనకు పాలన చేతకాదు.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీని గద్దె దించుతం.. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతం.. కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ ఏడాది క్రితం ప్రధాని నరేంద్రమోదీని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలివి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా బద్నాం చేయాలో అన్ని విధాలుగా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని కూడా ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ గెలవదని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, ఏడాది గడిచేలోగా అంతా తారుమారైంది. బీజేపీ బంగాళాఖాతంలో కలుపుతాన్న బీఆర్‌ఎస్ పార్టీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలోనూ అధికారం కోల్పోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధికారం కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
బీజేపీతో దోస్తీకి..
బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతామన్న కేసీఆర్ ఇప్పుడు తమ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి కమలం పార్టీతో దోస్తీకి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు కూతురు లిక్కర్ స్కాంలో ఐదు నెలలుగా జైల్లో ఉండడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను జైల్లో పెట్టేందు ప్రయత్నిస్తుండడంతో ఇప్పుడు కేసీఆర్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ చాలా అవసరం అయింది. కేంద్రం సహకారం లేకుంటే తమ కూతురు లాగానే తాను, తన కొడుకు కేటీఆర్ జైలుకు వెళ్తారని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి స్నేహహస్తం అందిస్తున్నారు.
టీడీపీ తరహాలో వ్యూహం..
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అంతకు ముందు బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబు నాయకుడు ఎన్నికల ముందు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఫలితంగా టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత టీడీపీ ఎంపీలు, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితరులు బీజేపీలో చేరారు. వీరు ఇటీ బీజేపీ, అటు టీడీపీని సమన్వయం చేసుకుంటూ రాజకీయాలు నెరిపారు. దీంతో 2024 నాటికి టీడీపీ, బీజేపీ మళ్లీ ఒక్కటయ్యాయి. 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసి ఘన విజయం సాధించాయి.
బీజేపీలోకి బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు..
చంద్రబాబు ఫార్ములాను కేసీఆర్ అనుసరించాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరేందుకు గులాబీ బాస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బీజేపీకి రాజ్యసభలో బలం లేనందున వచ్చేవారిని చేర్చుకుంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్ధసారధిరెడ్డి, దామోదర్‌రావు, సురేశ్‌రెడ్డిని బీజేపీ కోసం త్యాగం చేసేందుకు కేసీఆర సిద్ధమయ్యారని సమాచారం.
కేటీఆర్, హరీశ్ ఢిల్లీలో మంత్రాంగం..
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో నలుగురు బీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీలో చేరిపోతే తెర వెనుక కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించిన్నట్లే అనుకోవచ్చు. రెండు నెలల్లో ఈ మేరకు రాజకీయ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇదే నమ్మకంతో రెండు నెలల్లో రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని కేటీఆర్ కూడా ప్రకటించారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చి తిరిగి బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రావడానికి బీజేపీ సహకరిస్తుందని గులాబీ నేతలు నమ్ముతున్నారు. అయితే రాజ్యసభలో బీజేపీకి ఎంపీలో అవసరమేమో కానీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ గద్దెనెక్కడానికి సహకరించే అవకాశాలు లేవు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 34 శాతం ఓటింగ్ సాధించింది. ఐదేళ్లు కష్టపడితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రోత్సహించే అవకాశం లేదు. రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు అంగీకరించే అవకాశం లేదు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Brs rajya sabha members join bjp