Telangana Elections 2023: తెలంగాణలో అధికారాన్ని డిసైడ్ చేసేవి ఈ నియోజకవర్గాలే!

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు కీలకంగా ఉంటాయని.. ఈ స్థానాల్లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతున్నది. పైగా ఈ నియోజకవర్గాలలో త్రిముఖ పోటీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Written By: Bhanu Kiran
  • Published On:
Telangana Elections 2023: తెలంగాణలో అధికారాన్ని డిసైడ్ చేసేవి ఈ నియోజకవర్గాలే!

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం నాటికి ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జనాలను కలవడం.. ఇలా తాము ప్రచారం చేసుకోవడానికి ఏ మార్గాన్ని కూడా వారు వదలడం లేదు. సరే అభ్యర్థులు ఎలా ప్రచారం చేసుకున్నప్పటికీ అంతిమంగా ప్రజలు ఓటు వేస్తేనే గెలుస్తారు. సరే అది వేరే విషయం. అయితే తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పోటీ అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. కెసిఆర్ కూడా పదేపదే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేశారు.. అయితే ఈ క్రమంలో తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారు? భారత రాష్ట్ర సమితి మూడవసారి అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని దక్కించుకుంటుందా? భారతీయ జనతా పార్టీ కింగ్ మేకర్ అవుతుందా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలేమో గానీ.. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు కీలకంగా ఉంటాయని.. ఈ స్థానాల్లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతున్నది. పైగా ఈ నియోజకవర్గాలలో త్రిముఖ పోటీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ నియోజకవర్గాలు ఏంటంటే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముథోల్‌, నిర్మల్‌, బోధ్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కామారెడ్డి, నిజామాబాద్‌(అర్బన్‌), ఆర్మూరు, జుక్కల్‌. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌, కరీంనగర్‌, కోరుట్ల, వేములవాడ, మానకొండూరు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌, వరంగల్‌(ఈస్ట్‌), పరకాల, ములుగు. హైదరాబాద్ దగ్గరలోని రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, ఎల్బీనగర్‌, చేవెళ్ల, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌, మక్తల్‌. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దుబ్బాక, పఠాన్‌చెరువు, నర్సాపూర్‌. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, మునుగోడు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గోషా మహల్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, జూబ్లీ హిల్స్‌, మల్కాజ్‌ గిరి ఈ నియోజకవర్గాలలో త్రిముఖ పోరు ఉందని తెలుస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులు కూడా బలమైన నాయకులుగా ఉండడం వల్ల రాష్ట్రం మొత్తం ఈ నియోజకవర్గాల వైపే చూస్తోంది. ఈ స్థానాల్లో తాము విజయం సాధిస్తామని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నమ్ముతున్నారు.. ఇక్కడ గెలిచి ఏర్పడబోయే ప్రభుత్వంలో కింగ్ మేకర్ అవుతామని చెబుతున్నారు.

ఇవే బలాలు

ఇక్కడ పోటీలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థల్లో చాలామంది ఒకప్పుడు భారత రాష్ట్ర సమితిలో ఉన్నవారే. వాళ్లంతా పదవులు అనుభవించినవారే. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. తర్వాత ఎన్నికల్లో కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. స్థానికంగా వీరికి ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఇక్కడి స్థానాల్లో తాము విజయం సాధిస్తామని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ఈ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ పెద్దలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గాలలో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోంది. ఇది తమకు
లాభిస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు కూడా విస్తృతంగా ప్రచారం సాగించారు.. అయితే అన్ని పార్టీలకంటే భారతీయ జనతా పార్టీకి ఒకింత మొగ్గు ఎక్కువగా కనిపించడం.. అటు భారత రాష్ట్ర సమితిని, ఇటు కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ స్థానాల్లో గనుక భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు