Pakistan vs West Indies: ప్రపంచంలో క్రికెట్ ఆడే జట్లలో అత్యంత అనిశ్చితి తో కూడిన జట్టుగా పాకిస్తాన్ కు పేరు ఉంది. ఏ సమయంలో ఎలా ఆడుతుందో ఆ జట్టు ప్లేయర్లకే తెలియదు. ఎందుకు అలాంటి ఆట తీరు కొనసాగిస్తారు.. ఎందుకు వెంటనే మారిపోతారు అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఒక్కొక్కసారి అంచనాలకు మించి ఆడతారు. ఒక్కోసారి అంచనాలను తలకిందులు చేస్తారు.
వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ ఇటీవల వెళ్ళింది. వామప్ మ్యాచ్లో సత్తా చూపించింది. దీంతో పాకిస్తాన్ ఈసారి వెస్టిండీస్ లో ఏదో చేసే విధంగా ఉందని అందరు అనుకున్నారు. కానీ పాకిస్తాన్ అంతలోనే తనను తాను తక్కువ తీసుకుంది. చివరికి తలవంపు కరమైన ఆట తీరుతో తలవంచుకుంది . తొలి టెస్ట్ లో ఏకంగా 90 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచింది అనేదానికంటే.. పాకిస్తాన్ చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది అనడం సబబు.
ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు చేసింది. కెప్టెన్ హోప్ 92.. హడ్జ్ 84 పరుగులు చేసి అదరగొట్టారు. పాకిస్తాన్ జట్టులో మహమ్మద్ అలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అబ్బాస్ 3 వికెట్లు.. షాజద్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ సమర్థవంతంగానే బ్యాటింగ్ చేసింది. మసూద్ 109 పరుగులు చేసి అదరగొట్టాడు. హక్ 63 పరుగులతో సత్తా చూపించాడు. ఒక దశలో పాకిస్తాన్ 197/3 వద్ద నిలిచింది. ఆ తర్వాత గ్రీవ్స్ రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ జట్టుకొద్దిమ్మ తిరిగిపోయింది. చూస్తుండగానే మిగతా 7 వికెట్లను కేవలం 85 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఫలితంగా 282 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ముగించింది.
అనంతరం వెస్టిండీస్ జట్టు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే ఈసారి పాకిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశారు. మహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు పడగొట్టాడు. షాజాద్.. మహమ్మద్ అలీ చెరి 2 వికెట్లు సొంతం చేసుకున్నారు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో సత్తా చూపించాల్సిన పాకిస్తాన్.. చాప చుట్టేసింది. వెస్టిండీస్ బౌలర్ల ముందు నిల్వలేకపోయింది. కెప్టెన్ బాబర్ అజాం 58 మినహా మిగతా ఏ బ్యాటర్లు కూడా సమర్థవంతంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. పాకిస్తాన్ జట్టులో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కు పరిమితమయ్యారు. ఇందులో ఇద్దరు సున్నా పరుగులకు అవుట్ అయ్యారు.
వెస్టిండీస్ మైదానాలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రారంభంలో పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బంతి వేగంగా మారిపోతూ ఉంటుంది. అనూహ్యమైన తీరుతో దూసుకు వస్తూ ఉంటుంది. దీనిని పాకిస్తాన్ ప్లేయర్లు అంచనా వేయలేకపోయారు. అందువల్లే చేతులారా ఓటమిని తెచ్చుకున్నారు. గెలవాల్సిన మ్యాచ్లో 90 పరుగుల తేడాతో ఓడిపోవడం అంటే అది పాకిస్తాన్ జట్టుకే చెల్లుతుందని సోషల్ మీడియాలో అభిమానులు పేర్కొంటున్నారు.