Komati Reddy Rajagopal Reddy : కాంగ్రెస్ అంటుకుంది.. కోమటిరెడ్డి బ్రదర్ అంటించాడు..

రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన సన్నిహితుల వద్ద బాధపడినట్టు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల సారాంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం . ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : March 23, 2024 10:56 pm

Komati Reddy Rajagopal Reddy

Follow us on

Komati Reddy Rajagopal Reddy : “తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గూ శరం ఉందా? గత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ ఆయనకు పదవి కేటాయించారు”.. ఈ మాటలన్నది ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకుడు కాదు.. తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకి అంతకన్నా కాదు. ఈ మాటలన్నది అధికార పార్టీ ఎమ్మెల్యే. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం.. రేవంత్ రెడ్డి పై రాజ్యసభ మాజీ సభ్యుడు వీ. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు మర్చిపోకముందే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. సాధారణంగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో అధికారపక్ష ఎమ్మెల్యేనే అధికార పార్టీ మంత్రిని విమర్శించడం కోస మెరుపు. పైగా ఆ ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంట ఉన్న సహాయకుడు తప్పని చెప్పారు. “మీరు మాట్లాడేది సరి చూసుకోండని” అన్నాడు. అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. పైగా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏదో విషయం మీద మాట్లాడుకుంటూ ఆయన ఆకస్మాత్తుగా తుమ్మల నాగేశ్వరరావు మీద విమర్శలు చేశారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా కొనసాగుతున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళల్లో ఆయన రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పు పట్టారు. తుమ్మల తెలంగాణ ఉద్యమంలో పాల్గొననప్పుడు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడాన్ని సిగ్గూ శరం లేని చర్యగా అభివర్ణించారు. రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడుతున్నప్పుడు.. ఆయన పక్కన ఉన్న సహాయకుడు తుమ్మల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోగా కవర్ చేసేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు.

రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన సన్నిహితుల వద్ద బాధపడినట్టు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల సారాంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం . ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటి? ఉన్నట్టుండి తుమ్మలపై విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటనేది అంతు పట్టకుండా ఉంది. అటు వీ. హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన విమర్శలను మర్చిపోకముందే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి తుమ్మలపై కీలక వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది పార్లమెంటు ఎన్నికల ముందు నేతలు ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతుండడంతో రేవంత్ రెడ్డికి సరికొత్త తలనొప్పి ఎదురవుతున్నది.