Biopic Movies: అన్ని పొలిటికల్ బయోపిక్ లు సావిత్రి, ధోనీ లవ్వవు..పైగా ప్రచార ఖర్చులు బొక్క

2019 ఎన్నికలకు ముందు నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద ఎన్టీఆర్ అనే సినిమాను రెండు భాగాలుగా తీశాడు. అప్పట్లో టిడిపి అధికారంలో ఉంది.

  • Written By: Suresh
  • Published On:
Biopic Movies: అన్ని పొలిటికల్ బయోపిక్ లు సావిత్రి, ధోనీ లవ్వవు..పైగా ప్రచార ఖర్చులు బొక్క

Follow us on

Biopic Movies: బలమైన కథ.. కట్టిపడేసే కథనం.. చూడాలి అనిపించే నటీనటుల నటన.. వినాలి అనిపించే పాటలు.. ఇవన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే ఒక సినిమా విజయవంతం అవుతుంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా.. దానికి బయోపిక్ అని పేరు పెట్టి.. పొలిటికల్ ఇంట్రెస్ట్ లు దాచిపెట్టి.. బలవంతంగా రుద్దితే జనం ఈడ్చితంతారు. నాగ్ అశ్విన్ “సావిత్రి”, మహేంద్రసింగ్ “ఎంఎస్ ధోని” వంటి బయోపిక్ లు జనాన్ని అలరించాయని.. జనం చూస్తున్నారు కాబట్టి.. రాజకీయ నాయకుల బయోపిక్ లు కూడా తీసి బలవంతంగా రుద్దితే.. ప్రచార ఖర్చులు కూడా రావు.. రాజకీయ ఆసక్తులున్న నిర్మాతలు తెలుసుకోవాల్సింది కూడా ఇదే. ఇటీవల వచ్చిన యాత్ర_2 సినిమా నిర్మాతలు కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టి తీసినప్పటికీ.. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో జనాలను థియేటర్ల వద్దకు తీసుకు వచ్చినప్పటికీ.. ఫలితం ఉండటం లేదు. కేవలం యాత్ర_2 మాత్రమే కాదు.. అటల్ బిహారీ వాజ్ పేయి బయోపిక్ “మై అటల్ హూ” లో పంకజ్ త్రిపాఠీ ఎంత గొప్పగా నటించినప్పటికీ..ఆ సినిమా వచ్చినట్టు బిజెపి కార్యకర్తలకే తెలియలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2019 ఎన్నికలకు ముందు నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద ఎన్టీఆర్ అనే సినిమాను రెండు భాగాలుగా తీశాడు. అప్పట్లో టిడిపి అధికారంలో ఉంది. పైగా మహి వి రాఘవ్ అనే దర్శకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర పై యాత్ర సినిమా రూపొందించాడు. అప్పట్లో యాత్ర సినిమా విజయవంతం కాగా.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై తీసిన రెండు సినిమాలు అడ్డంగా ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమా కోసం అప్పట్లో టిడిపి నాయకులు సొంతంగా టికెట్లు కొని ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని యాత్ర_2 సినిమా విషయంలో వైసిపి నాయకులు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులను, ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వారిని తీసుకెళ్లాలని వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటిని ఆ పార్టీ నాయకులు అమలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోవడం లేదు. తెలుగు నాట ఇలాగే ఉంటే.. మన పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రపై తలైవి అనే సినిమా రూపొందించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించారు. కంగన రనౌత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ సొంత రాష్ట్రంలో జనాలే ఆ సినిమాను పట్టించుకోలేదు. నవాజుద్దీన్ సిద్ధిక్ “థాకరే” అనే సినిమా తీస్తే నిర్మాత ప్రచారానికి పట్టిన ఖర్చులు కూడా రాలేదు. మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర పై తీసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాను కూడా ఎవరూ పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్ర పై మోడీ అని ఓ సినిమా తీస్తే ప్రేక్షకులు పట్టించుకోలేదు. మోడీ పాత్రలో వివేక్ ఓబెరాయ్ జీవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

వాస్తవానికి పైన వివరించిన రాజకీయ నాయకులు మొత్తం గొప్పవారే. వారి రాజకీయ జీవితంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న వారే. ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా పనిచేసి రాష్ట్రం, దేశంలో సమూల మార్పులకు బీజం వేసిన వారే.. అయినప్పటికీ వారి జీవిత చరిత్రపై తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఆ నిర్మాతల వెనుక ఎవరు ఉన్నారు అనేది ముంచేతి కంకణమే అయినప్పటికీ.. ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కూడా దర్శక, నిర్మాతలు వాస్తవ పరిస్థితి ఆధారంగా సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు