WhatsApp : నేటి కాలంలో వాట్సాప్ లేని మొబైల్ కనిపించదు. విద్యార్థుల స్కూల్ సమాచారం సైతం ఇప్పుడు వాట్సాప్ లోనే పంపుతున్నారు. అయితే వాట్సాప్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు ఉన్నాయని కొందరు అంటుంటారు. ముఖ్యంగా చిన్న వయసువారు వాట్సాప్ ను యూజ్ చేయడం వల్ల అనేక అనర్థాలకు దారి తీస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వాట్సాప్ లో ‘ఏజ్ నిబంధన’ అనే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాట్సాప్ లో ఏజ్ నిబంధన పెట్టే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా వాట్సాప్ మాతృ సంస్థ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. అసలు వయసు నిబంధన పెడితె ఎలా ఉంటుంది?
కొన్ని దేశాల్లో..
ప్రస్తుతం వాట్సాప్ సేవలను ఉపయోగించడానికి కొన్నిదేశాల్లో వయసు నిబంధన ఉంది. 13 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే వాట్సాప్ ఖాతా తెరవాలని వాట్సాప్ సేవా నిబంధనలు పేర్కొంటాయి. కానీ భారత్ లో ఇప్పటి వరకు అమలు చేయలేదు.
భారత్ లో..
భవిష్యత్తులో ప్రభుత్వం లేదా మెటా వయస్సు ధ్రువీకరణను తప్పనిసరి చేస్తే.. వినియోగదారులు తమ జన్మతేదీ లేదా వయస్సును నమోదు చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మొబైల్ నంబర్, ప్రభుత్వ గుర్తింపు పత్రం లేదా ఇతర డిజిటల్ ధృవీకరణ విధానాల ద్వారా వయస్సును నిర్ధారించే అవకాశం కూడా ఉండొచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏజ్ నిబంధన అవసరమా?
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై చిన్నారుల భద్రత, ఆన్‌లైన్ వేధింపులు, మోసాలు, హానికర కంటెంట్, డిజిటల్ వ్యసనం వంటి అంశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అందువల్ల చాలా దేశాలు పిల్లల భద్రత కోసం సోషల్ మీడియా సంస్థలు వయసు ధ్రువీకరణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రయోజనమేనా?
వయసు ధ్రువీకరణ అమలైతే చిన్నారులను అనుచిత కంటెంట్ నుంచి రక్షించడం సులభమవుతుంది. నకిలీ ఖాతాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. సైబర్ నేరాలు, మోసాలు, పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఆన్‌లైన్ ముప్పులను కొంత మేర నియంత్రించవచ్చు. అలాగే వయస్సుకు అనుగుణంగా కొన్ని ఫీచర్లను పరిమితం చేసే అవకాశం కూడా ఉంటుంది.
నష్టాలేంటీ?
మరోవైపు వయస్సు ధృవీకరణ కోసం వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి రావడం వల్ల గోప్యత పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఎలా భద్రపరుస్తారు? డేటా దుర్వినియోగం జరగదా? వంటి ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి నిబంధనలు అమలు చేసే ముందు స్పష్టమైన గోప్యతా ప్రమాణాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.