Mark Zuckerberg: ఆధునిక కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కేవలం సమాచార వేదికలు మాత్రమే కావు. అవి ప్రజాభిప్రాయాన్ని రూపొందించే, రాజకీయాలను ప్రభావితం చేసే, ప్రభుత్వాల ఉనికిని సవాలు చేసే శక్తిగా మారాయి. అల్గారిథమ్‌లు, పెయిడ్ బూస్టింగ్, డీప్‌ఫేక్‌లు వంటి సాధనాల ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌లు ప్రజల దృష్టిని నియంత్రించగలవు. ఇది ప్రభుత్వాలకు కొత్త సవాలుగా మారింది.
నేపాల్ అనుభవం..
నేపాల్‌లో ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నమోదు చేయనందుకు నిషేధించింది. యువత రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసింది. కాల్పుల్లో దాదాపు 20 నుంచి కొన్ని డజన్ల మంది మరణించారు. నిషేధం ఎత్తివేసినా నష్టం జరిగిపోయింది. ప్రధానమంత్రి రాజీనామా చేశారు. ఇది సోషల్ మీడియాను అదుపు చేయాలనే ప్రయత్నం ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. యువత ఆగ్రహాన్ని నియంత్రించలేకపోవడం, ప్రజాస్వామ్య వేదికలను మూసివేయడం వల్ల వచ్చే పరిణామాలు స్పష్టం.
భారత్‌లో అల్గారిథమ్‌లు, బూస్టింగ్ ప్రభావం..
భారత్‌లో మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు అతిపెద్ద వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్నాయి. రాజకీయ ఉద్యమాల సమయంలో కంటెంట్ ఎలా వ్యాప్తి చెందుతుందో అల్గారిథమ్‌లు నిర్ణయిస్తాయి. పెయిడ్ ప్రమోషన్, బూస్టింగ్ ద్వారా కొన్ని వ్యూలు పెరుగుతాయి. ఒక ఉద్యమానికి అధిక వ్యూస్, మరొక పక్షానికి తక్కువ వ్యూస్ కనిపించడం ప్రజాభిప్రాయాన్ని మార్చగలదు. డీప్‌ఫేక్‌లు, ఫేక్ కంటెంట్ ఇంకా సమస్యను పెంచుతాయి. ఇలాంటి సాధనాలు ప్రభుత్వాల పనితీరును, చలనాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి అనే వాదన బలంగా ఉంది.
మోదీ వీడియో 5 గంటలు ఆపి..
ఇటీవల యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన వీడియోను 5 గంటలు అందుబాటులో లేకుండా ఆపేసింది. దీనిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. సాంకేతిక కారణం అని మెటా చెప్పినా, ఇది పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ప్రభుత్వం దీన్ని తేలికగా తీసుకోలేదు. సంబంధిత అధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు. సేఫ్ హార్బర్ రక్షణను తొలగించే అవకాశం ఉందని హెచ్చరిక వచ్చింది. మెటా అధికారులు భారత్‌కు వచ్చి చర్చలు జరిపారు. క్షమాపణ, వివరణలు అవసరమని స్పష్టం చేశారు. ఇతర ప్లాట్‌ఫామ్‌లకు కూడా సూచనలు పంపారు. ఇది దేశం వెలుపల ఉన్న కంపెనీలు దేశీయ రాజకీయాలను ప్రభావితం చేస్తే, జాతీయ సార్వభౌమత్వం ఎలా నిలబడుతుందనే ప్రశ్న. భారత్ అతిపెద్ద మార్కెట్ కాబట్టి ప్లాట్‌ఫామ్‌లు ఒత్తిడికి లొంగాల్సి వస్తోంది. ఉద్యమాల వెనుక ఉన్న హ్యాండిల్స్, రిజిస్ట్రేషన్‌లు, నిధులు వంటి వివరాలు అవసరమని ప్రభుత్వం చూపిస్తోంది.
జవాబుదారీతనంతో భవిష్యత్తు..
సేఫ్ హార్బర్ క్లాజ్ ప్లాట్‌ఫామ్‌లను మూడవ పక్ష కంటెంట్‌కు బాధ్యత నుంచి కాపాడుతుంది. దీన్ని తొలగిస్తే వారు ప్రచురణకర్తలుగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది పెద్ద మార్పు. అయితే నియంత్రణ అవసరం అనేది నిజం. అల్గారిథమ్ పారదర్శకత, ఫేక్ కంటెంట్ నియంత్రణ, పెయిడ్ ప్రమోషన్‌లపై స్పష్టత అవసరం. అదే సమయంలో అధిక నియంత్రణ స్వేచ్ఛను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. ప్రైవసీ సమస్య మరో ముఖ్య అంశం. వ్యక్తిగత డేటా విశ్లేషణ ద్వారా అభిప్రాయాలు ఊహించడం, ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం జరుగుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం.
మొత్తంగా చూస్తే, సోషల్ మీడియా ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకుంది అనే అవగాహన పెరుగుతోంది. నేపాల్ ఉదాహరణ హెచ్చరిక. భారత్‌లో ప్రభుత్వం స్పష్టమైన స్థానం తీసుకుంటోంది. ప్లాట్‌ఫామ్‌లు సాంకేతిక సామర్థ్యంతో పాటు జవాబుదారీతనం చూపాలి. ప్రజాస్వామ్యంలో సమాచార స్వేచ్ఛ, జాతీయ ప్రయోజనాలు రెండూ సమతూకంలో ఉండాలి. మోదీ వీడియో 5 గంటలు ఆపినందుకు మెటా చీఫ్ మార్క్ జూకర్‌బర్గ్ రంగొంలోకి దిగి వెంటనే క్షమాపణ చెప్పారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు.. భవిష్యత్ రాజకీయాలు, సాంకేతిక పాలన ఎలా ఉండాలో నిర్ణయించాలి.