WhatsApp Parental Controls : మెసేజింగ్ యాప్ వాట్సాప్ టీనేజర్ల భద్రత, ప్రైవసీపై మరింత దృష్టి సారించింది. టీనేజ్ యూజర్లు యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులకు మరింత నియంత్రణ కల్పించేలా కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఈ నియంత్రణలు ఉన్నప్పటికీ.. టీనేజర్ల వ్యక్తిగత చాట్స్, ఫోన్ కాల్స్‌ను తల్లిదండ్రులు చూసే లేదా వినే అవకాశం ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది.
కొత్త ఫీచర్లలో భాగంగా తల్లిదండ్రులు, టీనేజర్లు కలిసి ప్రైవసీ సెట్టింగ్స్‌ను నిర్ణయించుకోవచ్చు. టీనేజర్ ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడొచ్చు? వారిని ఎవరు గ్రూపుల్లో యాడ్ చేయొచ్చు? వంటి అంశాలపై నియంత్రణ పెట్టుకోవచ్చు. ఒకసారి తల్లిదండ్రులు నిర్దేశించిన సెట్టింగ్స్‌ను టీనేజర్ మార్చాలనుకుంటే.. పేరెంట్ సెట్ చేసిన PIN ద్వారా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాకుండా టీనేజర్ ఏదైనా వాట్సాప్ గ్రూపులో చేరినా లేదా గ్రూప్ నుంచి బయటకు వచ్చినా తల్లిదండ్రులకు నోటిఫికేషన్ వచ్చేలా చేయవచ్చు. అలాగే టీనేజర్ ఉన్న గ్రూపులో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు కూడా అలర్ట్ అందుతుంది.
ఛానల్స్, స్టేటస్‌పైనా నియంత్రణ
వాట్సాప్ ఛానల్స్, స్టేటస్ ఫీచర్లపైనా తల్లిదండ్రులకు నియంత్రణ కల్పిస్తోంది. టీనేజర్లు ఛానల్స్‌ను ఎలా ఉపయోగించాలి? ఎవరెవరి స్టేటస్ అప్‌డేట్స్‌ను చూడొచ్చు? వారి స్టేటస్‌ను ఎవరు చూడొచ్చు? వంటి అంశాలను తల్లిదండ్రులు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
ఇక వాట్సాప్‌లోని Meta AI వినియోగంపైనా అదనపు నియంత్రణలు అందుబాటులోకి వస్తున్నాయి. 13 ఏళ్లు పైబడిన వారికి అందించే డిఫాల్ట్ అనుభవాన్ని ఎంచుకోవచ్చు. లేదంటే మరింత కఠినమైన ‘Limited Content’ ఆప్షన్‌ను కుటుంబాలు ఎంపిక చేసుకోవచ్చు.
ప్రైవేట్ చాట్స్‌కు మాత్రం రక్షణ
కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌లో కీలకమైన విషయం ఏమిటంటే.. టీనేజర్ల వ్యక్తిగత సందేశాలు, కాల్స్‌పై తల్లిదండ్రులకు యాక్సెస్ ఉండదు. వాట్సాప్‌లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా చాట్స్‌ను తల్లిదండ్రులు కానీ, వాట్సాప్ కానీ చదవలేవు. కాల్స్‌ను కూడా వినలేరు.
తల్లిదండ్రులు తమకు అనుకూలంగా ఈ కంట్రోల్స్‌ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. కుటుంబాల నుంచి వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని భద్రతా ఫీచర్లను తీసుకురావడానికి ఇది తొలి అడుగు అని వాట్సాప్ తెలిపింది.
ఇదిలా ఉండగా, వాట్సాప్ ఇటీవల ప్రైవసీకి సంబంధించిన మరిన్ని మార్పులను కూడా తీసుకొస్తోంది. జూన్‌లో యూజర్‌నేమ్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా ఫోన్ నంబర్‌ను వెల్లడించకుండానే ఇతర వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలతో చాట్ ప్రారంభించే అవకాశం కలుగుతుంది. గ్రూప్ చాట్స్‌లో కూడా వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను వెంటనే షేర్ చేయకుండా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.