Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో దివ్యభారతి కథానాయికగా నటించింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా సుధీర్.. దివ్యభారతిని ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సుధీర్ పెళ్లి.. ఆయన సంపాదన గురించి ప్రధానంగా చర్చ నడిచింది.
సుధీర్ ఈ స్థాయిలో పేరు సంపాదించినప్పటికీ.. భారీగా డబ్బులను వెనకేసుకుంటున్నప్పటికీ.. ఇప్పటికీ ఆయన చేతిలో రూపాయి ఉండదట. స్వయంగా ఇదే విషయాన్ని సుధీర్ సుమ తో చెప్పారు. గతంలో సుమ హోస్ట్ చేసిన షోలో ఆటో రాంప్రసాద్.. గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకి వెళ్లినా.. ఫారిన్ ట్రిప్పులకు వెళ్లినా.. సుడిగాలి సుధీర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడట. ఆ వ్యవహారం మొత్తం అతని తండ్రి చూసుకుంటాడట. సుధీర్ బయటకు వెళ్ళినప్పుడు ఆయన తండ్రి రెండు కార్డులు చేతిలో పెడతాడట. వాటి పిన్ నెంబర్లు కూడా సుధీర్ కి తెలియదట. చివరికి బిల్లు కట్టే సమయంలో సుధీర్ ఫోన్ చేసి అడిగితే చెప్తారట. ఇదే విషయాన్ని గెటప్ శ్రీను.. ఆటో రాంప్రసాద్ చెబితే.. సుమ ఇదే విషయాన్ని సుధీర్ ను అడిగారు. దానికి అతడు నిజమే అని ఒప్పుకున్నాడు. ఇప్పటికీ నీ చెయ్యి మీ నాన్న చేతిలోనే ఉంది అంటే సుధీర్ గట్టిగా నవ్వేశాడు.
ఇక పెళ్లి గురించి సుమ అడిగితే.. ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేదు అన్నట్టుగా సుధీర్ సంకేతాలు ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేయాలని అంటున్నారని.. కానీ నేనే వాయిదా వేస్తున్నానని సుధీర్ చెప్పుకొచ్చాడు. సుధీర్ తమ్ముడికి పెళ్లి జరిగింది. అతడికి పిల్లలు కూడా పుట్టారు. గతంలో ఒక ప్రేమ వ్యవహారం వల్ల సుదీర్ డిస్ట్రబ్ అయ్యాడు. అప్పటినుంచి అతడు తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి దూసుకుపోతున్నాడు. కమెడియన్ గా.. హోస్ట్ గా.. చివరికి హీరోగా తన కెరియర్ మొత్తాన్ని బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి విషయంలో సుధీర్ కాస్త జాగ్రత్త వహిస్తున్నాడు. ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానని.. పెళ్లి ఎందుకని సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాడు..
ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు రాజీవ్ కనకాల విషయాన్ని సుమ ప్రస్తావించింది. తను పెళ్లి చేసుకున్నా చాలా హ్యాపీగా ఉన్నాడు కదా అంటూ సుమ వివరించింది. దీనిపై సుధీర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడు. గతంలో ఆయన నటించిన సినిమాలలో ఆయన పాత్రలు చనిపోయేవి. కానీ ఇప్పుడు బతుకుతున్నాయి. అందువల్లే ఆయన నవ్వుతూ ఉన్నారని సుధీర్ చెబితే.. అది కూడా ఒక కారణమని సుమ వివరించింది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ సాఫీగా సాగిపోయింది. అయితే చివర్లో మాత్రం దివ్యభారతిని సుమ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె ముక్తసరిగా సమాధానం చెప్పింది.
గోట్ సినిమా చిత్రీకరణ సమయంలో దివ్యభారతికి.. సుధీర్ కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది. ఆమె వ్యవహార శైలి నచ్చక కొద్ది రోజులపాటు సుధీర్ షూటింగ్ కు దూరంగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత నిర్మాత తో కూడా సుదీర్ కు విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. అనేక అవాంతరాలను దాటుకొని మొత్తానికి ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న సమయంలో కూడా దివ్యభారతి తో సుధీర్ అంత చనువుగా మాట్లాడలేదు. దివ్యభారతి కూడా ఓపెన్ గా తన విషయాలు ఏమీ చెప్పలేదు.. కాకపోతే ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ సుధీర్ కాబట్టి.. యూత్ ఆడియన్స్ కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ సుధీర్.. గాలోడు వంటి సినిమాల ద్వారా సుధీర్ కు ఆడియన్స్ పల్స్ అందరికి అర్థమైంది. అందువల్లే గోట్ సినిమాను జెన్ జెడ్ ఆడియన్స్ చూసే విధంగా దర్శకుడు రూపొందించినట్టు తెలుస్తోంది.