Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు సపోర్ట్ ఇవ్వాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఇది తెలంగాణ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు గులాబీ పార్టీ నాయకులలో భిన్నమైన అభిప్రాయాలకు కారణమైంది. పార్లమెంట్ లో ప్రస్తుతం గులాబీ పార్టీకి ఒక ఎంపీ కూడా లేరు. పెద్దల సభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వాస్తవానికి అత్యంత సున్నితమైన.. రాష్ట్ర రాజకీయ సమీకరణలను భవిష్యత్తులో మార్చే అవకాశం ఉన్న అంశంలో గులాబీ పార్టీ ఇలా నేరుగా భారత జెండా పార్టీకి ఔట్ రైట్ సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గులాబీ పార్టీ సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో గట్టిగానే లాబీయింగ్ చేసింది. గులాబీ పార్టీ సపోర్ట్ ఇచ్చినా సరే.. ఇవ్వకపోయినా సరే పెద్ద ఫరక్ పడదు. భారతీయ జనతా పార్టీ కెసిఆర్ తో మాట్లాడలేదు. సపోర్ట్ చేయాలని అడగలేదు. కాని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ముందుకు వచ్చి.. తాము తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కంకణం కట్టుకున్నామని బిల్డప్ ఇచ్చారు.
వాస్తవానికి ఈ విషయంలో గులాబీ పార్టీ తటస్థంగా ఉండి ఉంటే బాగుండేది. మొదట్లో డీలిమిటేషన్ కి కేటీఆర్ వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ పార్టీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రాంతాన్ని పూర్తిగా బొంద పెట్టే వ్యవహారం మీద అని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో రైతు చట్టాల విషయంలో.. అనేక వ్యవహారాలలో భారతీయ జనతా పార్టీకి ఒకసారి సపోర్ట్ ఇచ్చి.. మరోసారి వెనక్కి తీసుకుంది గులాబీ పార్టీ. డబుల్ గేమ్ ఆడి.. తన స్థాయిని నిరూపించుకుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులకు తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని సూచించి ఉంటే బాగుండేది. వివాదాలు.. విమర్శల నుంచి తప్పించుకునే అవకాశం ఆ పార్టీకి ఉండేది.
ఒకవేళ రాజ్యసభ సభ్యులు బిజెపికి అనుకూలంగా ఓటు వేసి ఉంటే అది వారి వ్యక్తిగత నిర్ణయం అని.. వారి ఇష్టప్రకారం నిర్ణయం తీసుకున్నారని గులాబీ పార్టీ కవరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సొంతంగా ఎటువంటి రాజకీయ లబ్ధి ఈ చట్టం ద్వారా గులాబీ పార్టీకి లభించే అవకాశం లేదు. ఇందులో అనేక రాజకీయ కోణాలు ముడిపడి ఉన్నాయి. ఇటువంటి బిల్లుకు గులాబీ పార్టీ సపోర్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం.
తెలంగాణలో బిజెపి ఎదుగుతోంది. ఆ పార్టీ బలపడుతోంది. ఇది గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటు బ్యాంకు.. క్యాడర్లో కొంత భాగం కమలం పార్టీ వైపు వెళ్లిపోయినట్టు వార్తలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో కేంద్రంలో బిజెపి సర్కార్ తీసుకొస్తున్న కీలకమైన బిల్లుకు గులాబీ పార్టీ బహిరంగంగా సపోర్ట్ ఇచ్చింది. పార్టీపరంగా మద్దతు ఇచ్చింది. అందువల్ల బిజెపితో తెరవెనుక స్నేహం ఉందని గులాబీ పార్టీ చెప్పకనే చెప్పిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది బిజెపిని తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా నిరుపే ప్రయత్నానికి బలం చేకూర్చుతుందని తెలుస్తోంది. అంతే కాదు గులాబీ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు మొదలుపెట్టింది.