Tarigoppula Incident: ఆంధ్రజ్యోతిలో ఒక వార్త.. దీనిని మెయిన్ ఎడిషన్ లో వేయాలి.. వేశారో లేదో తెలియదు.. అది తరిగొప్పుల మండల కేంద్రం. ఈ ప్రాంతంలో నాగ బండి రామచంద్ర.. పుష్ప నీల దంపతులు. ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు.. ఒక కుమారుడు.. రామచంద్రం.. గతంలోనే చనిపోయాడు. ఒక కుమార్తె కూడా కన్ను మూసింది. ఈనెల 24న పుష్పనీల అనారోగ్యంతో కన్ను మూసింది.
పుష్ప నీల చనిపోయిన విషయాన్ని ఆమె కుమారుడు ఉపేందర్ కు గ్రామస్తులు సమాచారం అందించారు. ఉపేందర్ కుటుంబంతో కలిసి హైదరాబాదులో ఉంటున్నాడు. అయితే తల్లి అంత్యక్రియలకు తాను రాలేనని ఉపేందర్.. మరో ఇద్దరు కుమార్తెలు తేల్చి చెప్పారు. దీంతో గ్రామస్తులు చొరవ చూపడంతో.. మరో ఇద్దరు కుమార్తెలు కలిసి అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే తలకొరివి పెట్టడానికి వారు నిరాకరించారు. దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది సహకారం.. గ్రామస్తులు కలిసి అంత్యక్రియలు జరిపారు. తల్లి చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ఉపేందర్ శనివారం సాయంత్రం గ్రామానికి వచ్చాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకు వచ్చావు అంటూ.. ఆస్తి కోసమా అంటూ అతడిని తన్ని తరిమేశారు. ఊరి పొలిమేర దాకా తరిమికొట్టారు. దాదాపు 300 మంది గ్రామ పెద్దలు ఉపేందర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. మరోసారి గ్రామానికి వస్తే తుక్కు రేగ్గొడతామని హెచ్చరించారు. ఉపేందర్ 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడ ఆర్టీవో ఆఫీస్ లో ఏజెంట్గా పని చేస్తున్నాడు. తల్లి అంత్యక్రియలకు అతడు ఎందుకు రాలేదు.. మీత కుమార్తెలు ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు..
పుష్పనిల మొత్తం కుమార్తెలకే పెట్టిందని కుమారుడు ఆరోపిస్తున్నారు. కుమారుడికే అన్ని పెట్టిందని మిగతా కుమార్తెలు విమర్శిస్తున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ కోపం వల్లే అంత్యక్రియలకు రాలేదని గ్రామస్తుల చెబుతున్నారు. పుష్పనీలకు చిన్న ఇల్లు ఉంది. రెండు గుంటల భూమి ఉంది. మొత్తం 10 లక్షల వరకు ఆస్తి ఉంది. వీటిని అమ్ముకోవడానికి ఉపేందర్ గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఐదు కుమార్తెలు పుట్టిన తర్వాత.. ఇంటికి వారసులు ఉండాలని రామచంద్రం.. పుష్పనీల ఒక కుమారుడిని కన్నారు. తమకు చరమాంకంలో బుక్కెడు బువ్వ పెడతాడని.. చనిపోతే తలకొరివి పెడతాడని భావించారు. కానీ అతడేమో అంత్యక్రియలకు హాజరు కాలేదు. చివరికి ఆస్తి అమ్ముకోవడానికి మాత్రమే ఊరికి వచ్చాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని పట్టించుకోలేదు. కానీ ఉపేందర్ తీరును గమనించిన గ్రామస్తులు పొలిమేర దాకా తన్ని తరిమేశారు.