YSRCP leadership crisis analysis: తెలంగాణలో( Telangana) బిఆర్ఎస్ ఓడిపోయింది. కెసిఆర్ అజ్ఞాతంలో ఉన్నారు. అయినా సరే ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. సీఎం రేవంత్ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నా.. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా.. మరోవైపు కవిత రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్న.. గట్టిగానే పోరాటం చేస్తున్నారు ఆ ఇద్దరు. పార్టీని ఏదో రకంగా ప్రజల మధ్య నిలబెడుతూనే ఉన్నారు. ఇలా కెసిఆర్ కోసం తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు గట్టిగానే నిలబడుతున్నారు. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ఆ తరహాలో అండగా నిలిచేవారు లేకపోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఉండేవారు లేకుండా పోతున్నారు.
గతంలో కుటుంబ సభ్యులు..
ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ( Ysr Congress) పార్టీ అంటే జగన్ చుట్టూ కుటుంబ సభ్యులు కనిపించేవారు. తల్లి విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించేవారు. చెల్లెలు షర్మిల రక్షణ కవచంగా నిలిచేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పుట్టుక నుంచి మొన్నటి ఓటమి వరకు జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం పార్టీ వద్దని వెళ్ళిపోయారు. వైసిపి కోసం, జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండే ఈ బలమైన శక్తి రక్షణ కవచంలా నిలిచేది. వీరంతా దూరమైన తరువాత వైసిపికి అండదండ లేకుండా పోయింది.
సజ్జలే దిక్కు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు జగన్మోహన్ రెడ్డికి రక్ష అని ప్రస్తుతం ఎవరైనా ఉన్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే సజ్జల సామర్థ్యం పై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ క్యాడర్ సైతం ఆయనపై అసహనంతో ఉంది. కేవలం సజ్జలు ఉన్నారన్న కారణంతో ఒక్కొక్కరిని వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే అంత మంది ఉంటారు. అధికారంలో లేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే వారే నిజమైన ఆప్తులు. అటువంటి ఆప్తులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు. గులాబీ పార్టీకి మాదిరిగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఇప్పుడు వైసీపీకి అవసరం.
స్పష్టంగా లోటు..
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్వాలేదు. సంక్షోభం ఎదురైన ప్రతిసారి మాత్రం నెంబర్ టు, నంబర్ 3ల పాత్ర గుర్తుకువస్తుంది. ఈ లోటు టిడిపికి లేదు. చంద్రబాబు చుట్టూ లోకేష్, నందమూరి బాలకృష్ణ, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు బలమైన నేతలు ఉండనే ఉంటారు. 2003లో చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు జగన్ కు కష్టం వస్తే ఎవరు అనేది ప్రశ్న. వైసీపీలో జగన్ తరువాత అంతటి రాజకీయ చరిష్మ. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ నిరాశ, నిస్పృహలతో ఉన్నప్పుడు వారిని భుజం తట్టి ధైర్యం చెప్పేందుకు ఇప్పుడు వైసీపీకి ఒకరు అవసరం. మరి ఆ అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించి తీర్చుతారో? లేదో? చూడాలి.