YS Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనుంది. కీలక బిల్లులను సభలో పెట్టి ఆమోదం తీసుకోనుంది. అయితే ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారి ఇటువంటి ప్రచారం నడుస్తూ వచ్చింది. ఈసారి కూడా మొదలైంది. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు హాజరు కానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. గవర్నర్ ప్రసంగాలకు మాత్రం ఒక పది నిమిషాల పాటు హాజరవుతున్నారు. కేవలం అనర్హత వేటు భయంతోనే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా జగన్ హాజరవుతారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. పార్టీ సీనియర్లు సైతం జగన్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
* సీనియర్ల అభిప్రాయం అదే..
ఇటీవల పార్టీ సీనియర్లతో జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. త్వరలో పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకుముందు జిల్లాల పర్యటనను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల్లో మాత్రం సభకు హాజరు కాకపోవడం పై భిన్న స్వరం వినిపిస్తున్నట్లు నేతలు అధినేతకు వివరించారు. సభకు హాజరై.. ప్రభుత్వాన్ని నిలదీయాలని.. కూటమి ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తే తక్షణం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేయాలని పార్టీ సీనియర్లు సూచించినట్లు తెలుస్తోంది. మర్యాద లేని సభలో ఉండడం ఎందుకు అని ప్రజలు ఆలోచించే వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు చేసింది అదేనని గుర్తు చేసినట్లు కూడా తెలుస్తోంది.
* కీలక బిల్లులు..
జగన్ అసెంబ్లీకి హాజరు అంశానికి సంబంధించి కొత్త చర్చ జరుగుతోంది. ఈసారి సభలో బీసీ ఆత్మ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చించి బీసీలకు న్యాయం జరిగింది టిడిపి హయాంలోనేనని.. కూటమిలోని మూడు పార్టీలు బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే బీసీలకు వైసీపీ ఏం చేయలేదని విమర్శ వస్తుంది. ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సభకు హాజరై కూటమి నుంచి అవమానం పొంది.. ఇదిగో అవమానిస్తున్నారు.. అందుకే సభకు రాను.. మళ్లీ ముఖ్యమంత్రి గానే అడుగు పెడతానన్న శపధం చేసి బయటకు వచ్చేస్తారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.