India surgical strike: భారత సైన్యం చరిత్రలో సర్జికల్ స్ట్రైక్ 1 (2016), సర్జికల్ స్ట్రైక్ 2 (2019 బాలాకోట్), ఆపరేషన్ సిందూర్ (2025) వంటి ధైర్యసాహసాలకు సాక్ష్యంగా నిలిచింది. గతేడాది ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో భారత సైన్యం పాకిస్తాన్‌లో చొరబడి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని నీలం లోయలోని కేరల్ ప్రాంతంలో భారత నావికా దళాలు (మార్కోస్) చొచ్చుకెళ్లి, పాక్ సైన్యం కుట్రను భగ్నం చేసింది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆష్గాన్ మీడియా ఈ అంశాన్ని ఫోకస్ చేయడంతో మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. ఇది భారత్ యుద్ధతంత్రంలో వచ్చిన మార్పుకు సంకేతం.
కేరల్ వ్యూహాత్మకంగా కీలకం..
నీలం లోయ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో అత్యంత సుందరమైన, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. ఇది నియంత్రణ రేఖ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో పాక్ సైన్యం ఇక్కడి నుంచే భారత్‌పై దాడులు చేస్తుండేది. ఉగ్రవాదులను చొచ్చుపెట్టడానికి ఇది ప్రధాన మార్గం. పాక్ సైన్యం తాజాగా ఇక్కడ పెద్ద ఎత్తున కుట్ర పన్నుతోందని, భారత్‌పై భీకర దాడికి సిద్ధమవుతోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో భారత సైన్యం నిద్రపోకుండా, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ వారిని మట్టుబెట్టింది. సాధారణంగా పారా కమాండోలు మాత్రమే సర్జికల్ స్ట్రైక్‌లు చేస్తారు. కానీ ఈసారి నావికా దళాల ప్రత్యేక దళం పాల్గొనడం గమనార్హం. ఇది నీలం నది జలమార్గం ద్వారా చొరబాటు జరిగినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తరహా చర్య..
2025 మేలో జరిగిన ’ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత నావికా దళం పాకిస్తాన్‌ను సముద్రంలో చుట్టుముట్టి, కరాచీ రేవులకే పరిమితం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ‘పాక్‌ను సముద్ర గర్భంలో కలిపేందుకు భారత్ కేవలం కొద్ది నిమిషాల దూరంలో ఉంది‘ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, నీలం లోయలో జరిగిన తాజా చర్య కూడా అదే తరహాలో ఉంది. పాక్ కుట్రను ముందే గుర్తించడం, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి, ముప్పును అడ్డుకోవడం జరిగిపోయాయి. ఏం జరిగిందనే స్పష్టత లేకపోవడం చూస్తే, ఇది అత్యంత రహస్యంగా జరిగినట్లు అర్థమవుతోంది.
ఆఫ్గాన్ మీడియా బయటపెట్టిన నిజాలు..
పాకిస్తాన్ మీడియా ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్ మీడియా దీనిని బయటకు లాగింది. తాలిబాన్లు పాక్‌తో విభేదాలు పెంచుకున్న నేపథ్యంలో, పాక్ సైనిక దుర్బలత్వాన్ని బయటపెట్టడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
నీలం లోయలో జరిగిన ఈ చర్య, భారత్ ఇకపై సరిహద్దు ఉగ్రవాదాన్ని సహించదని, అవసరమైతే శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ మట్టుబెడుతుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఒకవైపు తాలిబాన్లతో, మరోవైపు అంతర్గత తిరుగుబాట్లతో సతమతమవుతున్న తరుణంలో, భారత్ ఈ తరహా చర్యలు పాక్ భద్రతా వ్యవస్థను మరింత బలహీనపరుస్తాయి.