YCP Retired batch: ఏపీలో బలపడాలనుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోదలుచుకోలేదు. అక్కడక్కడ టిడిపి కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులతో విభేదాలు ఏర్పడిన ద్వితీయ శ్రేణి నాయకుల పై దృష్టి పెట్టింది. వారిని పిలిచి కండువాలు కప్పుతోంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి రిటైర్డ్ కాబోతున్న ఐఏఎస్, ఐపీఎస్లు వస్తున్నారు. కూటమి వచ్చిన నాటి నుంచి ప్రాధాన్యత లేని పోస్టింగులతో సర్వీస్ పూర్తి చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నిష్క్రమణ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఆశలు రేపుతోంది. పివి సునీల్ కుమార్, శ్రీలక్ష్మి వంటి వారు ఇప్పటికే రిటైర్ అయ్యారు. పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా త్వరలో రిటైర్ కానున్నారు. ఇలా రిటైర్ అవుతున్న వారంతా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పోరాడుతారని జోరుగా ప్రచారం నడుస్తోంది.
గతంలో టిడిపి హయాంలో..
గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఇలానే రిటైర్డ్ అయిన అధికారులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా రిటైర్ అయిన ఐ.వి.ఆర్ కృష్ణారావు సైతం అప్పట్లో వ్యతిరేకంగా గళం వినిపించారు. ఆయనకు చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా సరే ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి తేవాలని జగన్ ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వారు పదవిలో ఉన్నప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా పూర్తిస్థాయిలో కొమ్ముకాశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉండేవారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కూటమినేతలను వెంటాడారు.. వేటాడినంత పని చేశారు. కొందరైతే కార్యకర్తల మాదిరిగా పనిచేశారు.
అడ్డగోలుగా వెళ్లి..
సాధారణంగా ఒక ప్రభుత్వంలో పని చేసిన అధికారులు మరో ప్రభుత్వం వస్తే అపరాధాన్యత పోస్టులకు వెళ్లడం జరుగుతుంటుంది. కానీ వైసీపీ హయాంలో నిబంధనలు అతిక్రమించి, కనీస స్థాయిలో కూడా తాము అధికారులు అన్న విషయాన్ని మరిచిపోయి వైసిపి కార్యకర్తలు మాదిరిగా పనిచేసిన వారు ఉన్నారు. అటువంటివారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుప్పంలోనే దాడి జరిగినంత పని జరిగింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ఉండేవారు. కానీ ఆ దాడిని పసిగట్ట లేకపోగా.. సమర్ధించినంత పని చేశారు. ఇక పీవీ సునీల్ కుమార్ వైసిపి హయాంలో ప్రత్యర్థుల కస్టడీలు వంటి వాటిపై విమర్శలు ఉన్నాయి. అందుకే వీరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టింది.
సర్వీసులో ఉన్నప్పుడే..
సర్వీసులో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి కోసం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పనిచేసిన పెద్దగా వర్క్ అవుట్ అయ్యే ప్రయోజనం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. చేతిలో పవర్ లేకపోతే ఎలాంటి వారైనా ఒక ముడుచుకోవాల్సిందే. వారు ఇప్పుడు సాధారణ పౌరులు కూడా. కొత్తగా వారు పార్టీలో చేరి.. చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా పనిచేసి.. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేగలరా? మరి అదే జరిగి ఉంటే గతంలో వారు అనుకూలంగా పని చేసినప్పుడే ప్రజలు హర్షించి జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అధికారం ఇచ్చి ఉండేవారు కదా. రాజ్యాంగ వ్యవస్థల పరిధి దాటి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి చట్టపరమైన పరిణామాలు ఉంటాయో ఈ మాజీ అధికారులకు తెలుసు. పైగా జగన్మోహన్రెడ్డిని నమ్ముకున్న వారి పరిస్థితి కూడా వారికి తెలుసు. మాటలు చెప్పినంత మాత్రాన పనులు సులువు కాదు. ఈ మాజీ అధికారులు వైసిపి కోసం పనిచేస్తే ప్రజలు నమ్మే స్థితిలో కూడా లేరు. ఇక ఆలోచించుకోవాల్సింది వారే.