Pothina Mahesh: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలు ఇప్పటినుంచే సేఫ్ జోన్లు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అందుకే తాము ఆశించిన సీట్లు లభించే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత ఒకరు జనసేనలో చేరేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జనసేన లో ఉంటూ కీలక నేతగా ఎదిగిన క్రమంలో.. ఆశించిన టిక్కెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. కానీ ప్రారంభంలో ప్రాధాన్యత లభించింది. కానీ ఇప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ నేత పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే తిరిగి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
* విజయవాడ రాజకీయాల్లో..
విజయవాడ రాజకీయాల్లో కొద్దిరోజులపాటు పోతిన మహేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. జనసేన ఆవిర్భావం నుంచి పనిచేశారు మహేష్. బలమైన వాయిస్ కూడా వినిపించ గలిగారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బాగా పనిచేశారు. కానీ ఎందుకో తొందరపాటు నిర్ణయం తీసుకుని పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోయినప్పటికీ చాలా యాక్టివ్ గా కనిపించారు మహేష్. కానీ ఇటీవల ఆ యాక్టివ్ తగ్గింది. పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోతోంది వైసీపీలో. దీంతో అక్కడ ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి జనసేనలో వచ్చేందుకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో జనసేన సీనియర్ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. వారి ద్వారా ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
* పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ..
జనసేనలో ఉన్నప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ఆశించారు పోతిన మహేష్. అంతకుముందు 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ గౌరవప్రదమైన ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. పొత్తులో భాగంగా ఆ సీటు తనదేనని భావించారు. కానీ చివరి నిమిషంలో బిజెపి అభ్యర్థిగా సుజనా చౌదరి అక్కడ పోటీ చేశారు. అందుకే అవకాశం దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పోతిన మహేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ఆయనను గుంటూరు పార్లమెంటు ఇన్చార్జిగా పంపించారు. తనకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కావాలని కోరుతున్నారు మహేష్. కానీ అక్కడ మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. వారిని కాకుండా ఇవ్వలేమని జగన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే తిరిగి జనసేనలో చేరిపోవాలని పోతిన మహేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.