AP Cabinet Expansion: ఏపీ మంత్రివర్గ విస్తరణ పై రకరకాల ప్రచారం నడుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్న తరుణంలో తప్పకుండా విస్తరణ జరుపుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే సంక్రాంతికి అటు ఇటుగా విస్తరణ జరిగే అవకాశం ఉంది. అయితే ఓ ఐదుగురు మంత్రులపై కత్తి వేలాడుతోంది అనేది జరుగుతున్న ప్రచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లోగా మొత్తం ఎన్నికలను పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది జరిగిన తరువాత మంత్రివర్గ విస్తరణ జరగనుంది అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రధానంగా ఓ ఐదుగురు మంత్రులు మార్పు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వారి పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
* జూనియర్లతో మంత్రివర్గం..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్లతో కూడిన మంత్రివర్గం ఏర్పాటవుతుందని అంతా భావించారు. కానీ ఆ అంచనాలు తప్పుతూ.. జూనియర్లతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు చంద్రబాబు. క్యాబినెట్లో ఉన్న 24 మందిలో పదిమంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన వారే. అయితే క్యాబినెట్ కూర్పుతో సీనియర్లు అసంతృప్తికి గురవుతారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఈ జూనియర్ మంత్రుల టీం పనితీరు ఆశాజనకంగా లేదన్న అభిప్రాయం చంద్రబాబులో ఉంది. ప్రారంభంలో గట్టిగానే హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ గాడిలో పడ్డారు. కానీ ఓ ఐదుగురు మంత్రులు మాత్రం ఇంకా పని తీరు పరంగా వెనుకబడి ఉన్నారు. ఆపై రాజకీయంగా కూడా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే వారిని మార్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
* స్థానిక ఎన్నికల తరువాతే..
ప్రభుత్వం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని చూస్తోంది. డిసెంబర్ లోగా దాదాపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ముందుగా నిర్వహించాలని.. తరువాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని.. చివరిగా ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అంత సహేతుకం కాదు అనేది ఒక అభిప్రాయం. అందుకే సంక్రాంతి తర్వాత.. వేసవి లోపల మంత్రివర్గ విస్తరణ చేపడతారని తెలుస్తోంది. అయితే ఐదుగురు మంత్రులను తొలగించి సీనియర్లకు ఛాన్స్ ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఫైల్ క్లియరెన్స్ చేయడంలోనూ.. ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడంలోనూ కొందరు మంత్రులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిని చంద్రబాబు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ వారి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. అందుకే విస్తరణలో వారి మార్పు అనివార్యమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..