AP Local Body Elections: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పంచాయతీ సర్పంచులను మాత్రమే నేరుగా ప్రత్యక్షంగా ఎన్నుకునే వారు. ఇకనుంచి అన్ని స్థానిక సంస్థల కు ఈ నిబంధనను జతచేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. గతంలోనూ టిడిపి ప్రభుత్వం ఇదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికలకు నాంది పలికింది. కానీ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు దానిని బ్రేక్ చేశాయి. ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం ఆ సాహస నిర్ణయానికి దిగడం విశేషం.
* సన్నాహాలు మొదలు..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ కోర్టు కేసులు ఇతరత్రా అంశాలతో కొద్దికాలం జాప్యం జరిగే అవకాశం ఉంది. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పంచాయితీల పాలకవర్గం గడువు ముగిసింది. ఏప్రిల్ 2 తో సర్పంచులతో పాటు వార్డుల సభ్యుల పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారులు ప్రస్తుతం పాలనను నడిపిస్తున్నారు. మున్సిపాలిటీల పాలకవర్గం మార్చి 17తో ముగిసింది. ఆర్డీవో స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నిర్మించారు. మరోవైపు జడ్పిటిసి లతో పాటు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ ల పదవీకాలం కూడా ముగియనుంది. అందుకే దాదాపు మూడు నెలల్లో ఈ మూడు ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం.
* ఆ ఇబ్బందులను అధిగమించాలని..
అయితే ఎంపీపీ లతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు.. మున్సిపల్ చైర్మన్ ల తో పాటు మేయర్లను ఎన్నుకునే సమయంలో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రలోభాల పర్వం నడుస్తోంది. భారీగా డబ్బులు చేతులు మారుతుంది. రాజకీయంగా కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో సర్పంచ్ల మాదిరిగా నేరుగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇది అత్యంత సాహసవంతమైన చర్య. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. కూటమి పార్టీల మధ్య మంచి సమన్వయం ఉంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సంచలన నిర్ణయమే అని చెప్పుకోవచ్చు.