YS Jagan Mohan Reddy : అమ్మ పెట్టదు… అడుక్కొని తినివ్వదు.. అన్నట్టుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా నియమించలేదు. కూటమి ప్రభుత్వం మెగాడీఎస్సీ ప్రకటించి 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే.. అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా పోస్టుల భర్తీ జరిగిన ఏడాదిన్నర తర్వాత. కోర్టుకు వెళ్లిన సరైన ఆధారాలు చూపించలేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్న దీనిపై అదే పనిగా ప్రచారం మొదలు పెట్టింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. రిలే దీక్షలు కొనసాగాయి. ఈ తరుణంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు కర్నూలులో భారీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు.
* ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ లే..
2019 ఎన్నికలకు ముందు పదివేల ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. ఆ సమయంలో ఇది ఒక నోటిఫికేషన్ యేనా? మేం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తాం. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తూ పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. నిరుద్యోగ యువత ఆ మాటలను నమ్మి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఐదేళ్ల కాలం గడిచింది కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. ఐదేళ్లపాటు కళ్ళు కాయలు కాచేలా చూశారు నిరుద్యోగ యువత. అహర్నిశలు శ్రమించారు. అయితే కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా 6000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది జగన్ సర్కార్. కనీసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయింది.
* తొలి ఫైల్ గా సంతకం..
కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం డీఎస్సీ నోటిఫికేషన్కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత.. బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ముఖ్యమంత్రిగా డీఎస్సీ ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. అనుకున్న వ్యవధిలోనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేశారు. ఐదేళ్లపాటు కళ్ళు కాయలు కాచేలా చూసిన.. పట్టుదలతో చదువుకున్న అభ్యర్థులు.. నిబంధనలు అనుసరించి.. రిజర్వేషన్ల ప్రాప్తికి ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. అయితే ఏడాదిన్నర తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీలో అక్రమాలు అంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. కోర్టులకు వెళ్ళింది. ఆధారాలు చూపించలేకపోయింది. కేవలం రాజకీయం అనే కోణంలోనే ఆలోచన చేసి వేలాది కుటుంబాలు ఆందోళనతో గడిపేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది.
* ఆత్మగౌరవ సభతో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో ఆలోచించగా.. కూటమి ప్రభుత్వ పరంగానే దీనికి సమాధానం చెప్పాలని భావించింది. ఉన్నత విద్యాశాఖ అధికారులతోనే అనుమానాలను నివృత్తి చేసింది. అయినా సరే ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపైనే ఆందోళనలు జరుపుతోంది. దీంతో కడుపు మండిన 2025 డిఎస్సి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన వేలాది మంది ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకొని.. పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు. తప్పుడు ప్రకటనలు మానుకోకుంటే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇది తమను అవమానించడమేనని.. అహర్నిశలు శ్రమించి ఉపాధ్యాయ పోస్టులను సొంతం చేసుకుంటే ఇలా చేయడం చాలా అన్యాయమని వారు హెచ్చరిస్తున్నారు. 2024లో మాదిరిగానే 2029లో ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.