Mahindra XUV 3XO REVX EDGE : మహీంద్రా తన పాపులర్ SUV XUV 3XO లైనప్‌ను మరింత విస్తరించింది. తాజాగా REVX EDGE, REVX EDGE (O) వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరలు వరుసగా రూ.9.39 లక్షలు, రూ.9.89 లక్షలుగా ఉన్నాయి. ముఖ్యంగా రూ.10 లక్షలలోపే పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించడం ఈ కొత్త వేరియంట్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
REVX EDGE ధర, ఫీచర్లు
XUV 3XO REVX EDGE పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.9.39 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్, డీజిల్ మాన్యువల్ వేరియంట్ల ధర రూ.10.59 లక్షలుగా ఉంది. ఈ ట్రిమ్‌లో డీజిల్ AMT ఆప్షన్ లేదు.ఎక్స్‌టీరియర్‌లో డ్యూయల్‌టోన్ రూఫ్, బాడీ కలర్ గ్రిల్, 16 ఇంచుల స్టీల్ వీల్స్, బ్లాక్ వీల్ కవర్లు ఉన్నాయి. వీటితో పాటు బై-హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED సిగ్నేచర్ ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, ORVMలపై టర్న్ ఇండికేటర్లు లభిస్తాయి.
ఇంటీరియర్‌లో బ్లాక్ లెదర్ సీట్లు, 10.25 ఇంచుల HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. వైర్‌లెస్ Android Auto, వైర్డ్ Apple CarPlay, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, ఎత్తు సర్దుకునే డ్రైవర్ సీటు, రియర్ AC వెంట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
రూ.9.89 లక్షలకే పనోరమిక్ సన్‌రూఫ్
REVX EDGE (O) పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.89 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్, డీజిల్ మాన్యువల్ వేరియంట్ల ధర రూ.11.09 లక్షలు కాగా, డీజిల్ AMT ధర రూ.11.91 లక్షలు. EDGEతో పోలిస్తే EDGE (O) కోసం రూ.50,000 అదనంగా చెల్లించాలి.ఈ అదనపు ధరకు ప్రధానంగా పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. అంతేకాకుండా రూఫ్ రైల్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డింగ్ ORVMలు, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్లు వంటి ఫీచర్లు కూడా అదనంగా వస్తాయి.
35 సేఫ్టీ ఫీచర్లు
REVX EDGE, EDGE (O) రెండు వేరియంట్లలోనూ 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని మహీంద్రా తెలిపింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, Electronic Stability Control, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, అన్ని సీట్లకు త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి.
రూ.9.99 లక్షలకే పెట్రోల్ ఆటోమేటిక్
మహీంద్రా మరో కొత్త ఆప్షన్‌గా REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ.9.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో తీసుకొచ్చింది. దీంతో రూ.10 లక్షలలోపే XUV 3XO ఆటోమేటిక్ SUVని కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఈ కొత్త వేరియంట్లలో 1.2 లీటర్ mStallion TCMPFi పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. Everest White, Stealth Black, Tango Red, Nebula Blue, Galaxy Grey రంగుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఇదే సమయంలో XUV 3XO మొత్తం అమ్మకాలు 2.5 లక్షల యూనిట్లను దాటినట్లు మహీంద్రా ప్రకటించింది. రెండున్నరేళ్లలోనే ఈ మైలురాయిని చేరుకున్న తమ అత్యంత వేగవంతమైన SUVగా XUV 3XO నిలిచిందని కంపెనీ తెలిపింది.