Gondhal Oscar Entry: భారీ బడ్జెట్ సినిమాలు.. స్టార్ హీరోలు.. బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన వసూళ్లు.. ఇతర రికార్డులు.. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ.. ఇవి ఆస్కార్ విషయానికి వస్తే ప్రామాణికం కాదని ఇది మరోసారి తేలిపోయింది. వచ్చే ఏడాది ప్రకటించే ఆస్కార్ అవార్డుల కోసం మన దేశం నుంచి మరాఠీ చిత్ర సీమలో రూపొందిన గోందాల్ అనే చిత్రం ఎంపికైంది.
దురంధర్ కు షాక్
రన్ వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్, దురంధర్ రివెంజ్ సహా మొత్తం 33 సినిమాలను 14 మందితో కూడిన జ్యూరీ బృందం పరిశీలించింది. అనేక రకాల వడపోతల తర్వాత గోందాల్ వైపు నిలిచింది. ఈ సినిమాకు సంతోష్ దావ్ ఖర్ దర్శకత్వం వహించారు. మహారాష్ట్రలోని సాంప్రదాయ గోందాల్ అనే జానపదం ఆచారం చుట్టూ ఈ కథ సాగుతూ ఉంటుంది. గోందాల్ అనేది పూర్తిగా సంగీతం.. నృత్యం.. భక్తి.. పురాణ కథనాలతో రూపొందించిన ఒక మహారాష్ట్ర జానపద ప్రదర్శన..
ఈ సినిమా కథలో ఏముందంటే
గోందాల్ లో ప్రధాన కథ మొత్తం ఒక పెళ్లి వేడుక చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పెళ్లి వేడుకతో మొదలయ్యే కథ క్రమంగా అనేక మలుపులు తిరుగుతుంది. కోరికలు మొదలవుతాయి. అసూయ ప్రారంభమవుతుంది. మోసం అనేది తెరపైకి వస్తుంది. ద్రోహం చేయాలి అనిపిస్తుంది. చివరికి అది హత్యకు దారి తీస్తుంది. ఇది కుటుంబ సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. అనేక అంశాలు మొత్తానికి ఉత్కంఠకు దారి తీస్తాయి.. మహారాష్ట్రలోని గ్రామీణ జీవన విధానం.. అక్కడి సంప్రదాయాలు కథలో కీలకంగా ఉన్నాయి.
దురంధర్ ను ఎందుకు దూరం పెట్టారు
జ్యూరీ సభ్యులలో ఒకరైన వివేక్ వాస్వాని చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే..”దురంధర్, దురంధర్ ది రివెంజ్ సినిమాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించలేదు. ఆస్కార్ అవార్డులకు ఎంట్రీగా పంపించడానికి అవి సరిపోలేదు. 14 మందిలో కేవలం నలుగురు మాత్రమే దురంధర్ సినిమాకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ నిర్ణయం దురంధర్ సినిమాకు వచ్చిన బాక్సాఫీస్ విజయం లేదా వసూళ్ల ఆధారంగా తీసుకోలేదు. దురంధర్ పెద్ద సినిమా కాదని నేను చెప్పడం లేదు. ఆస్కార్ కు మన దేశం నుంచి పంపించే సినిమాల విషయంలో ఇక్కడి సంస్కృతి.. ప్రత్యేకమైన కథనం.. స్థానిక జీవన విధానాలు ముడిపడి ఉండాలి. అటువంటి వాటికి జ్యూరీ ప్రధాన ప్రాధాన్యం ఇస్తుంది.
అనేక అవార్డులు
గోందాల్ సినిమాకు అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. 2025లో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు అక్కడ ఈ సినిమా ప్రదర్శితమైంది. నాడు ఈ సినిమా దర్శకుడు సంతోష్ కు సిల్వర్ పీకాక్ పురస్కారం లభించింది. ఇక జ్యూరీ కి శేషాద్రి చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన అభిప్రాయం ప్రకారం 33 సినిమాలను పరిశీలించిన తర్వాత గోందాల్, అంగ్, బోయిన్ వాపస్ ఆవుంగా చివరి మూడు చిత్రాలు నిలిచాయి. అయితే ఇందులో గోందాల్ చిత్రాన్ని ఎంపిక చేశారు.
ఆస్కార్ నామినేషన్ ఖరారు కాదు
మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక అవడం అంటే ఆస్కార్ నామినేషన్ ఖరారు అయినట్టు అనుకోకూడదు. 99వ అకాడమీ అవార్డులలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగానికి మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా గోందాల్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత అకాడమీ 15 సినిమాలలో అధికారిక షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. చివరి ఐదు చిత్రాలను నామినేట్ చేస్తారు. వచ్చే ఏడాది మార్చి 14న అకాడమీ అవార్డుల ప్రధానం చేస్తారు.. దురంధర్ సినిమాకు స్టార్ పవర్.. విపరీతమైన మార్కెట్ ఉంటే..గోందాల్ సినిమాకు కేవలం లోకల్ కల్చర్.. జానపద కథ.. మానవ సంబంధాలు ఉన్నాయి. మన దేశం నుంచి ప్రపంచ వేదిక మీదకు బలమైన కథను చూపించాలనే ఉద్దేశంతో గోందాల్ సినిమాను జ్యూరీ సభ్యులు అకాడమీ అవార్డుల కోసం పంపించారు.