Vijayasai Reddy Media Channel : నిజంగా విజయ సాయి రెడ్డి మాటలు విన్న తర్వాత నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు గ్యారంటీ అని ఆనాలనిపించింది. నేటి కాలంలో ఎవరైనా ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేస్తున్నారంటే దాని వెనుక బలమైన కారణాలు ఉంటాయి. అయితే పొలిటికల్ లేదా వ్యాపారం.. లేదా ఇంకొకటి.. మీడియా చేతిలో ఉంటే అంత వైట్ అయిపోతుంది.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు తెలుగు నాట ఉన్న పెద్ద పెద్ద మీడియా సంస్థల అధిపతులు చేస్తున్నది అదే కదా.
ఇప్పుడు ఈ జాబితాలోకి విజయసాయిరెడ్డి చేరిపోయారు. వైసిపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన పొలిటికల్గా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను బయటపెడుతున్నారు. కొన్ని సందర్భాలలో తాను అప్రూవర్ అవతానని కూడా చెబుతున్నారు. అంతేకాదు త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇంతటితోనే ఆగిపోవడం లేదు.. అన్నిటికంటే ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడుతున్నారు. మతమార్పిడుల గురించి వివరిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవుల కోసం.. ఎమ్మెల్యే టికెట్ల కోసం మత మార్పిడిలు చేసుకున్న వారి చిట్టా బయటపెడుతున్నారు.
ఇటీవల విజయవాడలో ఒక హోటల్లో తన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. దసరాకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. అంతేకాదు మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మీడియా సంస్థను తన కుమార్తె చూసుకుంటుందని ప్రకటించారు. తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి తన కుటుంబం నిర్వహించే మీడియా ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా వ్యవహరించదని.. న్యూట్రల్ గానే ఉంటుందని పేర్కొన్నారు.
వాస్తవానికి విజయ సాయి రెడ్డి చెప్పిన మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే మాటలకు.. చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నేటి కాలంలో రాజకీయ పార్టీకి సొంత మీడియా లేకుండా మనుగడ సాగించడం చాలా కష్టం. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థుల దాడులను తిప్పి కొట్టాలంటే.. మిగతా విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలంటే కచ్చితంగా సొంత మీడియా ఉండాలి. సొంత మీడియా లేకుండా విజయసాయిరెడ్డి పార్టీని నడిపించగలరా.. 2029 ఎన్నికల్లో ఏపీలో నిర్ణయాత్మక పాత్ర పోషించగలరా.. తలపండిన రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన విజయసాయిరెడ్డికి.. ఈ విషయం తెలియదా.. పోనీ తెలిసినా ప్రజలను వేరే వైపు మళ్ళిస్తున్నారా.. ఇదే చర్చ నడుస్తోంది.. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో..