YS Jagan: 2024 ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. పప్పు బెల్లం మాదిరిగా సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇప్పటికీ ఆయన ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. అందువల్లే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పోటీ చేసి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్నారు.
నాయకులకు దిశా నిర్దేశం
మనదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన ఏపీ రాష్ట్రంలో 2029 లో ఎన్నికలు జరుగుతాయి. 2029లో జరిగే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా ఆగలేకపోతున్నారు. అందువల్లే 2029 లో జరిగే ఎన్నికలలో లక్ష్యంగా చేసుకొని ఆయన కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. స్థానిక ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించబోతున్న నేపథ్యంలో ముందుగానే ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆయన నాయకులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు.
తొలి ఎంపి అభ్యర్థిని ప్రకటించారు
2029లో ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. టిడిపికి కంచుకోట లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను పోటీ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.. కొద్దిరోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయాలు ఊహించని స్థాయిలో మారిపోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీలో తిరుగులేని నాయకులుగా కొనసాగుతున్న తమ్మినేని సీతారాం భూవివాదంలో చిక్కుకుపోయారు. బొత్స సత్యనారాయణ కీలకమైన తన అనుచరుడిని దూరం చేసుకున్నారు. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను టిడిపిలో చేరిపోయారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్ పై ఇటీవల తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ మాట్లాడారు
తమ్మినేని సీతారాం.. బొత్స సత్యనారాయణ తో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. తాడేపల్లిలో వీరిద్దరితో ఆయన గంటల తరబడి భేటీలు జరిపారు.. జగన్ కబురు పంపడంతో సీతారాం తాడేపల్లి వచ్చారు.. తన కుమారుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అసలు ఉద్దేశాలను సీతారాం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. సీతారాం చెప్పిన మాటలను పూర్తిగా విన్న జగన్.. అలాంటి సమస్యలు ఉంటాయని.. పట్టించుకోవద్దని.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సూచించారు. పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని సీతారాం ను ఆదేశించారు.
టిడిపి కంచుకోట
శ్రీకాకుళం టిడిపికి కంచుకోట. ఇక్కడ రామ్మోహన్ నాయుడు మూడుసార్లు గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.. మరోవైపు డీలిమిటేషన్ వల్ల రాజకీయ సమీకరణాలు మారుతాయి అని జగన్ అంచనా వేస్తున్నారు.. సీతారాం ను పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. వైసీపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత నాయకుల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని.. జగన్ అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీతారాం మీద భూఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేయడం.. రకరకాల చర్చలకు కారణమవుతోంది. ఇప్పటికే సీతారాం కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ సీతారాం ను పోటీ చేయాలి అని ఆదేశించడం నిజంగా అంతు చిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.