Kia Carens CNG : కియా ఇండియా (Kia India) కొత్త CNG వేరియంట్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న కారెన్స్, కారెన్స్ క్లావిస్ మోడళ్లలో ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణించాలనుకునే వినియోగదారులకు ఈ కొత్త వేరియంట్లు మరో ప్రత్యామ్నాయంగా నిలవనున్నాయి.
కియా కారెన్స్ ప్రీమియం (O) CNG వేరియంట్ ధరను రూ.12,11,800గా నిర్ణయించింది. మరోవైపు కారెన్స్ క్లావిస్ HTE CNG ధర రూ.12,38,800గా ఉంది. HTE (O) CNG వేరియంట్ ధర రూ.13,34,800. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. సెప్టెంబర్ 4న సోరెంటో లాంచ్ సందర్భంగా కియా తన కొత్త CNG పవర్‌ట్రెయిన్ వివరాలను తొలిసారిగా వెల్లడించింది.
1.5 లీటర్ ఇంజిన్.. 6-స్పీడ్ మాన్యువల్
కారెన్స్, క్లావిస్ CNG వేరియంట్లలో 1.5 లీటర్ Smartstream న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించారు. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 96 PS పవర్, 123 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ప్రస్తుతం CNG వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కియా ప్రకటించలేదు.
ఈ వాహనాల్లో 60 లీటర్ల CNG సిలిండర్ను ఏర్పాటు చేశారు. ఇది ఫ్యాక్టరీ నుంచే అమర్చబడుతుంది. దీంతో పెట్రోల్, CNG రెండింటినీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. డ్రైవర్ అవసరానికి అనుగుణంగా రెండు ఇంధనాల మధ్య మారవచ్చు. CNG సిలిండర్‌ను బూట్‌లో ఏర్పాటు చేయగా, స్పేర్ వీల్‌ను వాహనం కిందనే కొనసాగించారు.
CNG కోసం ప్రత్యేక మార్పులు
అదనపు CNG హార్డ్‌వేర్‌కు అనుగుణంగా కియా ఇంజిన్ కాలిబ్రేషన్, సస్పెన్షన్‌లో మార్పులు చేసింది. రెండు మోడళ్లలో 16-అంగుళాల వీల్స్, అప్‌గ్రేడ్ చేసిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు అందించారు. మూడో వరుస సీటు బ్యాక్ ఫ్రేమ్‌ను కూడా మార్చి రిక్లైన్ యాంగిల్‌ను మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది.
అంతేకాకుండా ప్రత్యేక ఫ్యూయల్-చేంజ్ స్విచ్, 4.2-అంగుళాల కలర్ TFT MIDను అందించారు. ఇందులో CNGలో ఇంకా ఎంత దూరం ప్రయాణించవచ్చో చూపించే Distance-to-Empty సమాచారం కూడా ఉంటుంది.
పెట్రోల్, డీజిల్‌తో ధరల పోలిక
కారెన్స్ క్లావిస్ HTE పెట్రోల్ ధర రూ.11.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. HTE (O) పెట్రోల్ ధర రూ.12.35 లక్షల నుంచి ఉంటుంది. వీటితో పోలిస్తే CNG వేరియంట్లకు దాదాపు రూ.1 లక్ష వరకు అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే HTE (O) డీజిల్ ధర రూ.14.37 లక్షల నుంచి ప్రారంభమవుతుండటంతో, దానికి పోల్చితే HTE (O) CNG సుమారు రూ.1.02 లక్షలు తక్కువ ధరకు లభిస్తుంది.
ఇంతకుముందు కారెన్స్‌కు డీలర్ స్థాయిలో CNG మార్పిడి అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పుడు కంపెనీనే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG వ్యవస్థను అందిస్తోంది. అధిక నెలవారీ వినియోగం ఉన్న కుటుంబాలు, రోజువారీ కమ్యూటింగ్ చేసే వినియోగదారులకు ఈ ఆప్షన్ ఉపయోగకరంగా ఉండొచ్చు.
కియా ఇండియాకు సెప్టెంబర్ నెలలో ఇది మరో కీలక పరిచయం. సోరెంటో తర్వాత కారెన్స్ క్లావిస్‌లో మరిన్ని పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందుబాటులోకి తీసుకువస్తూ కంపెనీ తన మోడల్ లైనప్‌ను విస్తరిస్తోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ వంటి కొత్త ఆప్షన్లపై కూడా కియా దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో 2026 అక్టోబర్‌లో కొన్ని ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.