Tata Sierra Legend Series : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన సియెరా ఎస్‌యూవీకి కొత్త లెజెండ్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త ట్రిమ్ లైన్‌లో భాగంగా మొత్తం 18 వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.49 లక్షల వరకు ఉంది. సాధారణ సియెరా వేరియంట్లతో పాటు ఈ కొత్త లెజెండ్ సిరీస్‌ను కూడా టాటా విక్రయించనుంది.
18 వేరియంట్లు.. ఐదు ట్రిమ్‌లు
టాటా సియెరా లెజెండ్ సిరీస్‌లో స్మార్ట్+ ఎల్, ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్(ఓ), ప్యూర్+ ఎల్, అడ్వెంచర్+ ఎల్ అనే ఐదు ట్రిమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సియెరా దిగువ, మధ్య స్థాయి వేరియంట్ల ఆధారంగా వీటిని రూపొందించారు. ఆయా సాధారణ వేరియంట్ల కంటే లెజెండ్ సిరీస్ ధర సుమారు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఎక్కువగా ఉంటుంది.
స్మార్ట్+ ఎల్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలతో ప్రారంభమవుతుంది. డీజిల్ ఆటోమేటిక్‌తో కూడిన అడ్వెంచర్+ ఎల్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలుగా ఉంది.
ఫీచర్లలో భారీ అప్‌గ్రేడ్
స్మార్ట్+ ఎల్ వేరియంట్‌లో లెదరెట్ సీట్లు, లెదరెట్ ఇంటీరియర్ ట్రిమ్, వీల్ కవర్లు, ఆటో ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రూఫ్ రైల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
ప్యూర్ ఎల్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ కెమెరా, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ వైపర్, ఎత్తు సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీట్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
ప్యూర్ ఎల్(ఓ)లో వాయిస్ కంట్రోల్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అదనంగా ఉన్నాయి.
ప్యూర్+ ఎల్‌లో పూర్తి లెదరెట్ క్యాబిన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్ డ్రైవర్ సీట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, బాస్ మోడ్, థై సపోర్ట్ ఎక్స్‌టెండర్, 65W యూఎస్‌బీ-సీ ఛార్జర్లు వంటి ఫీచర్లు అందించారు.
అడ్వెంచర్+ ఎల్ టాప్ వేరియంట్‌లో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఎల్‌ఈడీ ఫాగ్ లైట్లు, టెర్రైన్ మోడ్‌లు, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మూడు ఇంజిన్ ఆప్షన్లు
లెజెండ్ సిరీస్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్‌పీ శక్తి, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158 బీహెచ్‌పీ, 255 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 బీహెచ్‌పీ, 260 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ప్యూర్+ ఎల్ వేరియంట్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్‌కు సియెరా శ్రేణిలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎంపికగా నిలిచింది. అలాగే అడ్వెంచర్+ ఎల్‌లో నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందించారు.
ఆరు రంగుల్లో సియెరా లెజెండ్
కొత్త లెజెండ్ సిరీస్‌ను ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్స్, మున్నార్ మిస్ట్, బెంగాల్ రోజ్, అండమాన్ అడ్వెంచర్ అనే ఆరు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అన్ని ట్రిమ్‌లలో మొదటి మూడు రంగులు అందుబాటులో ఉంటాయి. ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్(ఓ)లో మున్నార్ మిస్ట్ రంగు కూడా లభిస్తుంది. ప్యూర్+ ఎల్, అడ్వెంచర్+ ఎల్ వేరియంట్లలో మొత్తం ఆరు రంగుల ఆప్షన్లు ఉన్నాయి.
కొత్త ఫీచర్లు, అదనపు సౌకర్యాలు, విస్తృతమైన ఇంజిన్-గేర్‌బాక్స్ ఎంపికలతో సియెరా లెజెండ్ సిరీస్‌ను టాటా మోటార్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.