Thammineni Seetharam : త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు కూటమికంటే వైసీపీకి అత్యంత ముఖ్యం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బలం ఉందని నిరూపించుకోవాలి. 2024 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలి. స్థానిక ఎన్నికల్లో టిడిపి కూటమికి గట్టిగా సవాల్ విసిరాలి. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడాలి. అప్పుడే వైసిపి మీద జనాల్లో కాస్త సానుభూతి పెరుగుతుంది. అది కాస్త ఎన్నికల నాటికి మైలేజ్ లాగా మారుతుంది.
ఈ విషయంలో వైసిపి అడ్డంగా ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొంతమంది నేతల విషయంలో వైసిపి అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీని దెబ్బ కొట్టేలాగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వైసిపికి గతంలో తిరుగులేని బలం ఉండేది. 2024 ఎన్నికల్లో అది బలం కాదని తేలిపోయింది. ఆ తర్వాత నేతల అక్రమాలు.. భూకబ్జాలు తెరపైకి రావడం మొదలైంది. ఇలాంటి కేసులనే వైసీపీ పరిపాలన కాలంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం ఎదుర్కొంటున్నారు. ఆయన రాజకీయంగా ఒత్తిడి కూడా అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి ఆయనకు సపోర్టు కరువైనట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయన పార్టీకి దూరమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తమ్మినేని సీతారాం కు రాజకీయ వారసుడిగా ఆయన కొడుకు తమ్మినేని చిరంజీవి నాగ్ ఉన్నారు. ఆయన ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసిపి ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను మాట్లాడుతున్న మాటల మీద నమ్మకం లేకపోతే అంతర్గత సర్వే కూడా సరిచూసుకోవాలంటూ సూచించారు.
తమ్మినేని సీతారాం కొడుకు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ధర్మాన సోదరులు ఉన్నారని తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావు.. కృష్ణ దాస్ తమ్మినేని కుటుంబాన్ని రాజకీయంగా ఎదగకుండా తొక్కుతున్నారని సమాచారం. పైగా సీతారాం ను అధిష్టానం ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోమని సూచించింది. ఆ స్థానంలో చింతాడ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించింది. ఒక మహిళ ఎస్ఐపై వేధింపుల కేసులో రవికుమార్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. చాపరం ప్రాంతంలో భూకబ్జా కేసులో తమ్ముడిని కుటుంబ సభ్యుల పేర్లు బయటికి వచ్చాయి. ఇంతవరకు తమ్మినేని సీతారాం అరెస్ట్ కాలేదు. అయితే ఆయన కూటమినేతలతో కుమ్మక్కయ్యారని వైసీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ఆరోపణలను వైసిపి అధిష్టానం ఖండించలేదు.
ధర్మాన సోదరులు కూడా తప్పు పట్టలేదు. దీంతో సీతారాం వర్గీయులలో ఆగ్రహం పెరిగిపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల పరంగా సొంత దారి చూసుకోవడం ఉత్తమమని తమ్మినేని కుటుంబం ఒక అంచనాకు వచ్చింది. తమ్మినేని కుటుంబం రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఖాళీగా సామాజికవర్గంలో బలమైన నేతగా సీతారాం కు పేరు ఉంది. ఆయన గనక పార్టీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు వైసిపి ఇక్కడ దుకాణం మూసుకోవాల్సి ఉంటుంది.