Vivekananda Reddy Case: వైఎస్వై యస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. ఆ కేసులో నిందితులుగా ఉన్నవారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడి దృష్టి పెట్టడం విశేషం. ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తోంది. తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడి అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాదులోని కోకాపేట, పులివెందులలో అవినాష్ రెడ్డి నివాసాలతోపాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఈడి ఆరా తీస్తోంది. ఈడి అధికారులు కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం.
* నిందితుల ఇళ్లలో..
అయితే కేవలం అవినాష్ రెడ్డి కాదు.. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల ఇళ్లలోనూ ఈడి అధికారులు దాడులు చేశారు. పులివెందులలోని దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తొండూరు మండలం తుమ్మలపల్లి లో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు పులివెందులలో వైయస్ జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపడుతున్నారు. అయితే వీటికి సంబంధించి సమగ్ర వివరాలు రావాల్సి ఉంది.
* అంతా గందరగోళం..
అసలు ఏ కేసులో ఈడి తనిఖీలు చేపడుతుందో అర్థం కావడం లేదు. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల ఇళ్లలో తనిఖీలు జరుగుతుండడం విశేషం. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ తనిఖీలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇంతలో ఈడి ఎందుకు రంగంలోకి దిగింది అనేది ప్రశ్న. మొత్తం మీద ఈడి తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యుల చూపుతున్నారు. ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి తో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో సైతం తనిఖీలు జరగడం ఆసక్తికరంగా మారింది.