Jeep Wrangler Whitecap Mojito : భారత మార్కెట్లో ప్రీమియం ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని Jeep మరో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. Jeep Wrangler Whitecap Mojito Limited Editionను ఇండియాలో ఆవిష్కరించగా.. ఈ ప్రత్యేక ఎస్‌యూవీ కోసం ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇది సాధారణ మోడల్‌లా కాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నారు. ఈ స్పెషల్ ఎడిషన్‌ను రాబోయే వారాల్లో అధికారికంగా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రత్యేకమైన Mojito గ్రీన్ కలర్
Wrangler Rubicon ఆధారంగా రూపొందించిన Whitecap Mojito ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్ డిజైన్. ఈ ఎస్‌యూవీని ప్రత్యేకమైన బ్రైట్ గ్రీన్ ‘Mojito’ కలర్లో అందిస్తున్నారు. దీనికి కాంట్రాస్ట్‌గా వైట్ రూఫ్‌ను ఇచ్చారు. ముందు భాగంలోని గ్రిల్ సరౌండ్ కూడా వైట్ కలర్‌లో ఉండగా.. ఫెండర్లు బాడీ కలర్‌లోనే ఉంటాయి.
సైడ్ ప్రొఫైల్‌లో ‘1941’ డీకాల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇది ఒరిజినల్ Willys MB Jeep వచ్చిన సంవత్సరాన్ని సూచిస్తుంది. వెనుక భాగంలో వైట్ కలర్ ‘4 Wheel Drive’ స్టిక్కర్‌ను కూడా ఏర్పాటు చేశారు. పాతకాలం Jeep CJ మోడళ్లలో కనిపించే వైట్ టాప్ డిజైన్ నుంచి ఈ రెండు రంగుల థీమ్‌కు స్ఫూర్తి పొందినట్లు కంపెనీ పేర్కొంది.
ఇంటీరియర్‌లోనూ ప్రత్యేక మార్పులు
క్యాబిన్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. కొన్ని అదనపు ఫీచర్లను అందించారు. ఇందులో బిల్ట్-ఇన్ డ్యాష్‌క్యామ్, రీఇన్‌ఫోర్స్‌డ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. మిగతా ఫీచర్లు Rubicon నుంచి కొనసాగుతాయి.
వీటిలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ADAS సూట్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. అలాగే సబ్‌వూఫర్‌తో కూడిన 9-స్పీకర్ Alpine ఆడియో సిస్టమ్ కూడా ఉంది.
అదే శక్తివంతమైన ఇంజిన్
Whitecap Mojitoలో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. Rubiconలో ఉన్న 2.0-లీటర్, నాలుగు సిలిండర్ల డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 272hp పవర్, 400Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది. స్టాండర్డ్ 4×4 సిస్టమ్ కూడా కొనసాగుతుంది.
ధర ఎంత?
ప్రస్తుతం Jeep Wrangler Whitecap Mojito Limited Edition ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్‌కు ఆధారమైన Wrangler Rubicon ధర రూ.70.8 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీంతో Whitecap Mojito ధర కూడా ఇదే స్థాయిలో లేదా కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే అమెరికా, జపాన్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. దక్షిణ కొరియాలో కూడా కొంతకాలం విక్రయించారు. Jeep 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తున్న ప్రత్యేక Wrangler మోడళ్లలో Whitecap Mojito ఒకటి.
ప్రస్తుతం భారతదేశంలో Wrangler Unlimited, Rubicon, Willys 41 Special Edition మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. Whitecap Mojito రాకతో భారత మార్కెట్లో Wrangler లైనప్‌లో ఇది నాలుగో వేరియంట్‌గా నిలవనుంది.