Pawan Kalyan Surgery: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగింది. కొంతకాలంగా ఆయన అస్వస్థతకు గురవుతున్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలుమార్లు ఆస్పత్రికి కూడా వెళ్లారు. మందులు వాడుతున్నారు. అయితే శుక్రవారం ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. శనివారం వైద్యులు ఆయనకు సర్జరీ చేశారు.
సర్జరీ నేపథ్యంలో ఆయన దీర్ఘకాలం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆయన పూర్తిస్థాయిలో ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో నిర్విరామంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత మెట్ల మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సమయంలోనే ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పెండింగ్ సినిమాలకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నారు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావడంతో.. ఆయన మిగతా సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఓజీ2 సినిమా షూటింగ్ మొదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురి కావడంతో ఇప్పుడు ఆ సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో విస్తృతంగా ఏపీలో పర్యటనలు జరిపారు. మన్యం ప్రాంతంలో రోడ్లను ప్రారంభించారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదను నివారించడానికి కుంకి ఏనుగులను వదిలారు. ఆ తర్వాత మొక్కలు నాటే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ నివారించడానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇలా ప్రతి సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పర్యటనలు జరుపుతున్నారు. అందువల్లే ఆయనకు ఈ సమస్య వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు శస్త్ర చికిత్స జరిగింది కాబట్టి.. కొద్దిరోజుల వరకు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాలని.. ఆ తర్వాత తన విధుల్లో పాల్గొనవచ్చని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.
పవన్ కు శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి జనసేన, టిడిపి నేతలు వెళ్తున్నారు. అయితే ఈ ఫోటోలు మీడియాలో విడుదల కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కొద్దిరోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతిలో ఉన్న నేపథ్యంలో.. ఆయన శాఖకు సంబంధించిన నిర్ణయాలను జనసేనలోని కీలక నాయకులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వారు ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ.. ఆయా శాఖల పరిధిలో ఉన్న పనులను పూర్తి చేస్తారని సమాచారం..