YS Jagan: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. మరో రెండున్నర ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. అయితే ఎప్పటి నుంచే ఎన్నికల వాతావరణం నెలకొంది ఏపీలో. రేపే ఎన్నికలు అన్నట్టు సర్వేలు హల్చల్ చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఓ పాయింట్ కీలకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. అలాగని వారు జగన్ కు పూర్తి వ్యతిరేకం. జగన్ ఇక రారు.. రాకూడదు అనేది వారి అభిప్రాయం. ప్రభుత్వ వైఫల్యాలను తటస్థం రూపంలో ప్రస్తావిస్తుంటారు వారు. కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని అనుకూల విశ్లేషకులు కూడా నేరుగా చెప్పలేని పరిస్థితి ఏపీలో.
* అంతా అనుకూల విశ్లేషణలే..
విశ్లేషకుల ముసుగులో అనుకూల, వ్యతిరేక వైఖరి ఎక్కువమంది అవలంబిస్తుంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ని తీసుకుందాం. ఆయన విశ్లేషణలో ఎక్కువగా టిడిపి వ్యతిరేక భావజాలం ఉంటుంది. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు కొన్ని రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఆయనలో సైతం వైసిపి వ్యతిరేక భావజాలం ఉంటుంది. కానీ ఇలా అనుకూల, వ్యతిరేక విశ్లేషణలు,, అభిప్రాయాల విషయానికి వచ్చేసరికి ఇక జగన్ అధికారంలోకి వస్తారు అని ఎవరు చెప్పలేకపోతున్నారు. అధికారంలోకి రారు అన్న వారు ఎక్కువగా ఉంటున్నారు. కచ్చితంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి డామేజ్ చేసే విషయమే.
* అప్పట్లో అలా ప్రచారం..
2014 నుంచి 2019 ని తీసుకుందాం. టిడిపి అధికారంలో ఉండేది. బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఏకంగా ఆ పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. సహజంగానే దూకుడు అధికంగా ఉంటుంది. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు సైతం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చాయి. దీనికి తోడు మీడియా రూపంలో కూడా అద్భుత సహకారం అందింది. ఆపై విశ్లేషకుల ప్రచారం విస్తృతంగా సాగింది జగన్ కు అనుకూలంగా. అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పులు వెతికే మేధావులు అధికంగా ఉండేవారు. వారి మాట కూడా అలానే చెల్లుబాటు అయ్యేది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్మెంట్ అయిన ఐ వి ఆర్ కృష్ణారావు సైతం అప్పటి చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనకు పదవీ విరమణ తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు. అప్పట్లో ఒక్క ఐవిఆర్ కృష్ణారావు మాత్రమే కాదు.. మేధావుల ముసుగులో విశ్లేషణలు చేసే ప్రతి ఒక్కరూ అప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని సంకేతాలు ఇచ్చేవారు.
* మరో ఛాన్స్ లేదన్నట్టు..
ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. జగన్ పాలనను చూసి జనం తిరస్కరించారు. మరోసారి ఒకే ఒక్క ఛాన్స్ అడిగే పరిస్థితి కూడా లేదు. రోజురోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ప్రభుత్వం లో ఉన్నప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఏ అనుకూల విశ్లేషకులు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. 2024 ఎన్నికలకు ముందు జ్యోతిష్యులు, మేధావులు, చివరకు చిలుక ప్రశ్నలు, గోరు ప్రశ్నలు చెప్పినవారు సైతం జగన్ అధికారంలోకి వస్తారని చెప్పుకొచ్చేవారు. కానీ ఫలితాలు దారుణంగా వచ్చాయి. వారి క్రెడిబిలిటీ తగ్గింది. మరోసారి వారు ఆ సాహసం చేసే అవకాశం లేదు. అందుకే జగన్ అధికారంలోకి వస్తారన్న ప్రచారం కంటే.. రారు అనే ప్రచారానికే జనం ఒక నిర్ధారణకు వస్తున్నారు.