AP DSC Sports Quota : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెగా డీఎస్సీ నియామకాల్లో క్రీడా కోటా అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రతిపక్షాల ఆరోపణలు, మరోవైపు ప్రభుత్వ సమర్థనల నడుమ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు నేరుగా రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా తమ వాదనలను విస్పష్టంగా వినిపిస్తున్నారు.
మెరిట్ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేసిన 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో భాగంగా 2025 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో 421 స్పోర్ట్స్ కోటా పోస్టులను కేటాయించారు. రాత పరీక్ష లేకుండా, నిర్దేశిత క్రీడా నైపుణ్యాలు, పతకాలు, మెరిట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయడమే ప్రస్తుత రాజకీయ రచ్చకు ప్రధాన కారణమైంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, అర్హత లేని వారికి, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ రాజకీయ ఆరోపణలపై స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏళ్ల తరబడి క్రీడల్లో శ్రమించి, జాతీయ స్థాయిలో సాధించిన పతకాలు.. ప్రతిభ ఆధారంగానే అర్హత సాధించామని విజయవాడ సమావేశంలో స్పష్టం చేశారు. ఒకవేళ అధికారుల పరిశీలనలో ఎవరివైనా నకిలీ పత్రాలు ఉన్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప అర్హత ఉన్న అభ్యర్థులందరినీ ఒకే గాటన కట్టి అనుమానించడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రీడా ధ్రువపత్రాలతో పాటు టెట్ అర్హత, వెరిఫికేషన్ ప్రక్రియలోని ప్రామాణికతపై కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయని చెబుతున్నప్పటికీ ఏదైనా ధ్రువపత్రం నకిలీదిగా తేలితే తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ వివాదం సమసిపోవాలంటే రాజకీయ ప్రకటనల కంటే ఆధారాలతో కూడిన నిజనిజాలు బయటకు రావడం ముఖ్యం. అభ్యర్థుల క్రీడా రికార్డులు, విద్యార్హతలు, టెట్ సర్టిఫికెట్లను పారదర్శకంగా పునఃపరిశీలించి, అర్హత కలిగిన క్రీడాకారుల హక్కులకు భంగం కలగకుండా అక్రమాలకు పాల్పడిన వారు ఉంటే వారిపై మాత్రమే చర్యలు తీసుకునే దిశగా చర్యలు జరగాల్సి ఉంది.