DSC 2025: రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై ఆందోళన చేస్తోంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే అందుకు సరైన ఆధారాలు చూపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనుకూల మీడియా అనుమానాలను రాష్ట్ర విద్యాశాఖ యంత్రాంగం ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వస్తోంది. కానీ ఈ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఏడాది కిందట నియమితులైన 16000 మందికి పైగా ఉపాధ్యాయుల కుటుంబాల్లో మాత్రం అశాంతి నెలకొంది. అందుకే వారు సైతం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకు చెందిన వేలాదిమంది ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి నిరసన తెలిపారు. అయితే డీఎస్సీ2025 లో ఎంపికైన ఓ ఉపాధ్యాయురాలి తండ్రి మాత్రం వినూత్న స్థాయిలో నిరసన తెలిపారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* అహోరాత్రులు శ్రమించి..
సాధారణంగా డీఎస్సీ అంటేనే ఒక సాహస ప్రయత్నం. ఎంతో కష్టపడి పని చేయాలి. అహర్నిశలు శ్రమించాలి. ఆపై అదృష్టం ఉంటే కానీ కొలువు దక్కదు. అటువంటిది వైసిపి ఐదేళ్ల కాలంలో డీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా చేయలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసి.. సరిగ్గా 2024 ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా రోజుల వ్యవధి ముందు. కేవలం 6000 పోస్టులతోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాకమునుపే అది వాయిదా పడింది.
* ఒక్క డీఎస్సీ కోసం కళ్ళు కాయలు కాచేలా..
సాధారణంగా ఉపాధ్యాయ పోస్టు కోసం బీఈడీతో పాటు డైట్ పూర్తి చేయాలి. పూర్తి చేసిన వారు టెట్ రాయాలి. అప్పుడు వారు డీఎస్సీకి అర్హత సాధిస్తారు. అలా రాష్ట్రంలో లక్షలాదిమంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అయితే అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అనుసరించి 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారు. ఆ ప్రక్రియ అంత పూర్తయింది. ఎక్కడ కూడా డీఎస్సీ అభ్యర్థుల నుంచి ఎటువంటి అనుమానాలు లేవు. అభ్యంతరాలు లేవు. కానీ నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అయిన తర్వాత జరిగిన ఉద్యమాలతో రాజకీయాలపై ప్రభావం చూపింది. దీంతో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించడం ప్రారంభించింది. అయితే కోర్టుకు వెళ్ళింది కానీ అక్కడ చుక్కెదురు అయ్యింది. అయినా సరే అదేపనిగా ఆందోళనలు జరుపుతోంది. అదే డీఎస్సీలో ఎంపికైన తన కుమార్తె పరిస్థితిని తలచుకొని ఓ తండ్రి బాధపడ్డాడు. అందుకే తన వంతుగా మార్కెట్ కు వచ్చి మైక్ లో మరీ ప్రచారం చేశాడు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి ని గందరగోళపరచడమేనని.. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు అని.. ప్రజలు సైతం దీనిని ఖండించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.