Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి.. ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయి. ఇదే విషయాన్ని పౌర విమానయాన శాఖ తెలిపింది. అయితే అప్పటినుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు ఉన్న ఇంటర్నేషనల్ ట్రావెల్ కోడ్ ‘VTZ’ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇది అమలు కానుంది.
* నిలిచిపోనున్న విమానాలు..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో.. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపివేయనున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సివిల్ ఎంక్లేవ్ నుంచి 30 ఏళ్ల పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు ఆగిపోతాయని పౌర విమానయాన శాఖ ప్రకటన చేసింది. అయితే జాతీయస్థాయిలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉండనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పోలీస్ విమానాలు, ప్రభుత్వ అతిధుల రాకపోకలు సాగించే విమానాలు, లీజ్ , ఎయిర్ క్రాఫ్ట్, విఐపి లకు సంబంధించి విమాన రాకపోకలు కొనసాగుతాయి. నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ కార్యకలాపాలు సైతం కొనసాగనున్నాయి.
* గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో అంశాన్ని వెల్లడించింది పౌర విమానయాన శాఖ. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెడుతున్నట్లు తెలిపింది. 2024 సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు.. అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రం అధికారికంగా గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని 11 మంది మంత్రుల బృందం అక్కడే ఉంది. శుక్రవారం సాయంత్రానికి దాదాపు ఏర్పాట్లు అన్ని పూర్తి కానున్నాయి. ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.