Bhogapuram Airport Farmers: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తొలి ఫ్లైట్ ఎగిరింది. తొలి రోజు నుంచే అంతర్జాతీయ సర్వీసులు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం విమాన ప్రయాణికులకు పాసులు అందించారు. ఒక్క ఇండిగో సంస్థ 31 సర్వీసులను నడపనుంది ఈరోజు. మరోవైపు విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈరోజు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత ప్రయాణం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర క్యాబినెట్ లోనే ఈ ప్రతిపాదన రాగా ఓకే చెప్పారు సీఎం చంద్రబాబు.
* హైదరాబాద్ కు 160 మంది
విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన 2200 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. హామీ మేరకు వారందరికీ ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఈరోజు కొంతమంది రైతులకు విమాన ప్రయాణం కల్పించారు. 165 మంది రైతులకు హైదరాబాద్ పంపించినట్లు తెలుస్తోంది. విడతల వారీగా రైతులందరికీ విమాన ప్రయాణం కల్పిస్తారు. దీనిని ఒక మంచి అవకాశం గా భావిస్తున్నారు రైతులు. గతంలో ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన క్రమంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రారంభంలో ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు రైతులు. అయితే పునరావాసం తో పాటు నష్టపరిహారం చెల్లింపులు పూర్తి కావడం.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణాన్ని ఆనందంతో స్వీకరిస్తున్నారు.
* మూతపడిన విశాఖ ఎయిర్పోర్ట్..
ఇంకోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ మూతపడింది. ఆదివారం నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 10:45 గంటలకు విశాఖ నుంచి చివరి విమానం ఢిల్లీకి వెళ్లింది. అటు తరువాత నుంచి కమర్షియల్ విమాన సేవలు ఆగిపోయాయి. చివరి రోజు అక్కడ సిబ్బంది ఎమోషనల్ అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. విమానాశ్రయం తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయంలో భద్రతను విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ పర్యవేక్షించారు. అరైవల్, డిపార్చర్ వద్ద వాహనాల పార్కింగ్, వీఐపీల వాహనాల పార్కింగ్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది అంతర్గత భద్రతా ఏర్పాట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.