Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానంలో బాంబు పెట్టినట్లు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఓ ఇండిగో విమానంలో బాంబులు ఉన్నాయని హెచ్చరిస్తూ మెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అలెర్ట్ అయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో అభిమానం రెండు గంటలపాటు ఆలస్యంగా టేకాఫ్ తీసుకుంది. ఈనెల 17 నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంతలోనే సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చార్జీలపై నెగిటివ్ ప్రచారం జరిగింది. దానిని కొట్టిపారేశారు అధికారులు. ఇంకోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ఇండిగో విమానంలో బాంబులు ఉన్నాయంటూ ఏకంగా ఎయిర్పోర్టుకు మెయిల్స్ రావడంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే ఆదిలోనే ఇటువంటి నెగిటివ్ ప్రచారం వస్తుండడం పై పౌర విమానయాన శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* ‘ఇండిగో’ సర్వీసులు అధికం
ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సంస్థ ఎక్కువగా సర్వీసులు నడుపుతోంది. పూర్తిగా దేశీయ విమాన సర్వీసులు ఎక్కువగా ఇండిగో సంస్థ నుంచి నడుస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలకు ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానం నిన్న సాయంత్రం బయలుదేరేందుకు సిద్ధమయింది. ఇంతలోనే ఆ విమానంలో బాంబులు ఉన్నాయని.. భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే పేలుతాయంటూ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఈమెయిల్స్ వచ్చాయి. వెంటనే భద్రతాధికారులు స్పందించారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఏమీ లేవని తేలడంతో రెండు గంటలపాటు ఆలస్యంగా ఆ విమానం టేకాఫ్ తీసుకుంది.
* నెగిటివ్ ప్రచారం..
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగి రెండు రోజులే అవుతోంది. ఈ పరిస్థితుల్లో విమానాశ్రయంపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం నడిచింది. ముఖ్యంగా ఆర్టిసి తగినంతగా సర్వీసులు నడపడం లేదని.. భోగాపురం లో బస్సులు ఆపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయలేదని.. రెండు గంటలకు ఒక బస్సు తిరుగుతోందని.. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారంటూ ప్రచారం నడిచింది. ఆపై ఎయిర్పోర్టులో పార్కింగ్ చార్జీల రూపంలో నాలుగు చక్రాల వాహనాలకు 600 రూపాయలు వసూలు చేస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ కొంతమంది డ్రైవర్లు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే హైదరాబాదులో బయలుదేరిన విమానం లో బాంబుల ద్వారా భోగాపురం విమానాశ్రయాన్ని పేల్చివేస్తామన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. మొత్తానికి అయితే ఈ విమానాశ్రయం ప్రారంభం రోజుల్లోనే ఈ నెగిటివ్ ప్రచారానికి తెర లేపడం విశేషం.