Visakhapatnam Airport : విశాఖ విమానాశ్రయం సోమవారం నుంచి విశ్రమించనుంది. నాలుగున్నర దశాబ్దాల పాటు సేవలు అందించిన ఈ ఎయిర్పోర్ట్ ఇకనుంచి ప్రత్యేక అవసరాలకు మాత్రమే ఉపయోగపడనుంది. నేటి అర్ధరాత్రి నుంచి విమాన రాకపోకలు బంద్ కానున్నాయి. ఇక పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు నడవనున్నాయి. ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. రాకపోకలు ప్రారంభం కానున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పౌర విమానయాన సేవలు విశాఖ ఎయిర్పోర్టులో నిలిచిపోనుండడంతో నగరవాసులు ఓకింత బాధాతప్త హృదయాలతో గడపాల్సి వస్తోంది.
* నాలుగున్నర దశాబ్దాల సేవలకు తెర..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈనెల 1న ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే అధికారికంగా ఈనెల 17 నుంచి సేవలు ప్రారంభం అవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే పౌర విమానయాన సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఆ సమయం ఆసన్నం అయ్యింది. మరోవైపు ఇప్పటివరకు 45 సంవత్సరాలకు పైగా సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం పూర్తిగా బంద్ కానుంది. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలకు ఇక అక్కడ అనుమతించబోరు. తూర్పునౌకాదళం ఆధీనంలోకి ఈ ఎయిర్పోర్టు వెళ్లనుంది.
* ఘనమైన చరిత్ర..
విశాఖ ఎయిర్పోర్టుకు ఘనమైన చరిత్ర ఉంది. రోజుకు ఒక విమానం రాకపోకతో ప్రారంభమైంది ఎయిర్పోర్ట్. నాలుగు దశాబ్దాల కాలంలో 40 విమానాలు వచ్చి.. తిరిగి వెళ్లే స్థాయికి చేరుకుంది. కొత్త కొత్త అంతర్జాతీయ సర్వీసులను ప్రజలకు పరిచయం చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్వే నిర్మించారు. యుద్ధం ముగిశాక అవసరం లేకుండా పోయింది. దానిని 1962లో పౌర విమానాలు కోసం వినియోగంలోకి తీసుకువచ్చారు. కానీ పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. ఇండియన్ నేవీ 1972లో ఇదే రన్ వేను రక్షణ అవసరాల కోసం ఉపయోగించడం ప్రారంభించింది. విశాఖలో తూర్పునౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో 1986లో ఆ రన్ వేను భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు.
* ఒకే విమానంతో ప్రారంభం..
ప్రారంభంలో అయితే విశాఖ ఎయిర్పోర్టుకు ఒకటే విమానం వచ్చి వెళ్ళేది. ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకపోతే అది కూడా రద్దయ్యేది. కానీ తరువాత నుంచి పౌర విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రన్వే చిన్నదిగా, పల్లపు ప్రాంతాల్లో ఉండడంతో వరదల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. 2007లో 3050 మీటర్ల పొడవైన రన్వేను అందుబాటులోకి తెచ్చారు. అటు తరువాత నైట్ ల్యాండింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో రాత్రి 9 గంటల వరకు విమానాలు వచ్చేవి. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో 2008లో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ నిర్మించారు. క్రమేపి అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. శ్రీలంక, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ లకు అంతర్జాతీయ సర్వీస్ లో అందుబాటులోకి వచ్చాయి. అయితే తూర్పు నౌకాదళం పరిధిలోని ఐఎన్ఎస్ డేగాలో కార్యకలాపాలు పెరిగాయి. ఒకే ప్రాంగణంలో నేవీ విమానాలు, మరోవైపు పౌర విమాన రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇండియన్ నేవీ ఆంక్షలు కూడా పెంచింది. ఈ తరుణంలోనే 2014లో హుదూద్ తుఫాన్ తో విమానాశ్రయానికి నష్టం ఏర్పడింది. అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంకురార్పణ కలిగింది. ఇప్పుడు అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో.. విశాఖ ఎయిర్పోర్టులో పౌర విమానయానానికి తెరపడింది.