Bogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతం అయింది. అధికారికంగా విమాన రాకపోకలు ప్రారంభం అయ్యాయి. స్కూట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం అర్థరాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్ళింది. అలాగే ఈరోజు ఉదయం 6:45 గంటలకు ఇండిగో విమానం హైదరాబాదు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వచ్చింది. అటు తర్వాత ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం భోగాపురం వచ్చింది. ఉదయం ఎనిమిది గంటలకు మరో ఎయిర్ ఇండియా సర్వీసు భోగాపురం నుంచి బెంగళూరుకు బయలుదేరింది. దాదాపు ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు చెందిన దాదాపు 33 సర్వీసులు తొలిరోజు నడవనున్నాయి.
* జ్యోతి ప్రజ్వలనతో..
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈనెల 1న ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కానీ అధికారికంగా ఈ రోజు నుంచి విమాన రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 6 గంటలకు చెక్ ఇన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తొలి విమానంలో వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందించారు. ఎయిర్లైన్స్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తొలి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేకంగా స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లతో కూడిన బ్యాగులను గిఫ్టులుగా అందించారు. ఈరోజు నుంచి ఒక్క ఇండిగో సంస్థ 31 సర్వీసులను నడపనుంది. తొలిరోజు ఆరు నుంచి 7000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు 20 ఎలక్ట్రిక్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.
* అంతటా సందడి..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో సందడి వాతావరణం నెలకొంది. విద్యుత్ కాంతులతో విమానాశ్రయం కళకళలాడుతోంది. మరోవైపు భారీగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువమంది వలస కూలీలు వివిధ దేశాల్లో ఉన్నారు. ఆపై విదేశాల్లో చదువుకున్న యువత కూడా అధికం. అందుకే తొలి రోజు అంతటా సందడి నెలకొంది. ఒక్కసారిగా గతానికి భిన్నంగా ఆ ప్రాంతం కనిపించడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధానంగా 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి వాహనాలు యూటర్న్ తీసుకునే క్రమంలో ప్రత్యేకత సంతరించుకుంది. అటు విశాఖ నుంచి.. ఇటు విజయనగరం నుంచి.. మరోవైపు శ్రీకాకుళం నుంచి భారీగా విమాన ప్రయాణికులు ప్రత్యేక వాహనాల్లో రావడం కనిపించింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు సైతం భోగాపురంలో హాల్టు ఇస్తున్నారు. గతంలో సూపర్ లగ్జరీ, డీలక్స్ లాంటి బస్సులు ఆపేవారు కాదు. ఇప్పుడు అన్ని రకాల ఆర్టీసీ సర్వీసులు భోగాపురంలో నిలుపుతుండడం గమనార్హం.
View this post on Instagram