Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతికి అంకితం చేశారు.. ఈనెల 17 నుంచి విమాన రాకపోకలు పూర్తిస్థాయిలో ప్రారంభం అవుతాయి. అయితే అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరైనప్పుడు ప్రజలకు పెద్దగా నమ్మకం లేదు. పైగా దానిని ఒక రవాణా కేంద్రం గానే చూశారు. అది కూడా ఉన్నత వర్గాల వారి ప్రయాణ మార్గంగానే భావించారు. కానీ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ప్రచారం, తరువాత ఎయిర్పోర్ట్ ద్వారా మిగతా రంగాల అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రజల్లో కూడా ఒక రకమైన అవగాహన పెరిగింది . కేవలం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందంటే.. విమాన ప్రయాణం అని అంతా భావించారు. కానీ ఈ విమానాశ్రయం తో ఉత్తరాంధ్రలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని.. గణనీయమైన ప్రభావం ఉంటుందని తెలుస్తుండడం శుభపరిణామం.
* ఎన్నో పర్యాటక ప్రాంతాలు..
సాధారణంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతం అంటే ముందుగా గుర్తొచ్చేది ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖలో పర్యాటక ప్రాంతాలు అధికం. మన్యం చూడ చక్కగా ఉంటుంది. అరకు, బొర్రా గుహలు, లంబసింగి.. ఇలా ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విశాఖ నగరంలో సువిశాలమైన బీచ్ ఉంది. అనేక రకాల బీచ్లు విశాఖ నగర సొంతం. కైలాసగిరి, తొట్లకొండ, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, ఋషికొండ, భీమిలి బీచ్ ఇలా అన్ని ప్రత్యేకమే. ఈ పర్యాటక ప్రాంతాలకు కచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పర్యాటకుల తాకిడిని పెంచుతుంది. విదేశీ పర్యటకులతో పాటు మనదేశంలోనే ఇతర ప్రాంతాలకు చెందిన వారు తప్పకుండా సాగర నగర వీక్షణకు వస్తారు. ఒక్క విశాఖ మాత్రమే కాదు విజయనగరం తో పాటు శ్రీకాకుళం లో సైతం పర్యాటక ప్రాంతాలు అధికంగా ఉన్నాయి వీటన్నింటికీ పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
* ఆధ్యాత్మిక కేంద్రాలు..
మరోవైపు టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి జరగనుంది. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు, చూడ చక్కటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉత్తరాంధ్ర సొంతం. సింహాచలం సింహగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, విజయనగరం జిల్లాలోని రామ తీర్థాలు, రామనారాయణం.. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి అరసవల్లి దేవస్థానం, శ్రీకూర్మం, శ్రీముఖలింగేశ్వర వంటి ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. తూర్పు కనుమల్లో భాగంగా అత్యంత ఎత్తైన మహేంద్ర గిరులు సైతం పర్యాటక ప్రాంతాలుగా మారిన క్రమంలో.. విదేశీ పర్యాటకులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. టూరిజం తో పాటు టెంపుల్ టూరిజం గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.