Uttarandhra Development: ఉత్తరాంధ్ర పై టిడిపి కూటమి పట్టు బిగుస్తున్నట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు కళ్ళేదుటే కనిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా సంతృప్తి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా తమకు కలిసి వస్తుందని కూటమి అంచనా వేసుకుంటోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ఉత్తరాంధ్రలో ఘన విజయం సాధించింది. కేవలం రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో మాత్రం వైసిపి విజయం సాధించింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర మొత్తం కూటమి వశం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం అభివృద్ధి, పెట్టుబడులు, ఆపై మౌలిక వసతుల కల్పన. ఈ కారణాలతోనే కూటమి వైపు మరోసారి ఉత్తరాంధ్ర ప్రజలు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది.
* గత రెండేళ్లలో అభివృద్ధి..
నవ్యాంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగనంత అభివృద్ధి గత రెండేళ్ల కూటమిపాలనలో సాగింది. భారీగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఐటీ దిగ్గజ పరిశ్రమలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఐటీ హబ్ గా మార్చాలని భావించింది. అందుకు తగ్గట్టుగానే ఐటీ అనుబంధ పరిశ్రమల రాక ప్రారంభం అయింది. ఇంకోవైపు ప్రపంచ దిగ్గజ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం విశాఖలో జరగనుంది. ఆసియా వెలుపల అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కూడా ఇదే కావడం గమనార్హం. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు ఇది. అటువంటి ప్రాజెక్టు ఉత్తరాంధ్రలో నిర్మితం కానుండడం నిజంగా ఈ ప్రాంతానికి ఒక గేమ్ చేంజర్ గా నిలవనుంది.
* కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు..
మరోవైపు మిట్టల్ కంపెనీకి చెందిన స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే భారీగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వస్తుండడం ఉత్తరాంధ్ర ప్రజల్లో సంతృప్తికి కారణం. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధిత సంస్థలు ముందుకు వస్తున్నాయి. విశాఖ వేదికగా చాలా పరిశ్రమల రాక ప్రారంభం కూడా అయింది. మరోవైపు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటయింది. కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ విషయంలో సైతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కొత్త రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం అయ్యాయి.
* భోగాపురం విమానాశ్రయం తో..
తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం తో ఉత్తరాంధ్రలో సానుకూలత మరింత పెరిగింది. ఇప్పటివరకు విమానాశ్రయం అంటే ఉన్నత వర్గాలకు చెందినది అని భావించేవారు. కానీ ఇప్పుడు అందరి బతుకులు అందులో ఇమిడి ఉన్నాయని తెలుస్తుండడం ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇలా వరుసగా ప్రాజెక్టులు, భారీ నిర్మాణాలు అందుబాటులోకి వస్తుండడంతో ప్రజల్లో కూటమిపట్ల సంతృప్తి పెరిగింది. అందుకే వచ్చే ఎన్నికల్లో కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు ఏకపక్షంగా ఆదరించే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..