Nepal Flood Disaster: నేపాల్–టిబెట్ సరిహద్దులో ఇటీవల సంభవించిన భారీ వరదలు వందలాది ప్రాణాలు తీశాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లోని గ్రామాలు, వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. ట్రిసూలి, భోటేకోశి నదీ వ్యవస్థల వెంబడి వచ్చిన ఈ ఆకస్మిక వరదలు సరిహద్దు వాణిజ్య కేంద్రమైన గ్యిరోంగ్ పోర్టును కూడా ధ్వంసం చేశాయి. చైనా ఈ విపత్తుకు తమకు ఎలాంటి సంబంధం లేదని, నేపాల్ వైపు సరస్సు లేదా హిమానీనదం కూలడంతోనే ఇది జరిగిందని చెబుతోంది. అయితే విశ్లేషకులు, స్థానిక సమాచారం మాత్రం చైనా నిర్మాణ కార్యకలాపాలే ప్రధాన కారణమని వాదిస్తున్నాయి.
సరస్సు తెగిపోయిందన్న చైనా..
చైనా అధికారులు, రాయబార కార్యాలయం ప్రకారం ఈ వరదలు నేపాల్ భూభాగంలోని హై–ఆల్టిట్యూడ్ హిమానీనదం కూలడం లేదా భూకంపం వంటి సహజ కారణాల వల్ల మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత మట్టి, రాయి, మంచు కలిసిన భారీ ప్రవాహం సరిహద్దు దాటి రెండు వైపులా నష్టం కలిగించింది. వారు ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రకృతి విపత్తుల్లో సహకారం మాత్రమే అవసరమని నొక్కి చెప్పారు. సరిహద్దులో ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదాన్ని కూడా గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాలతో నదుల మళ్లింపు..
విశ్లేషకులు మాత్రం ఈ వాదనను సవాలు చేస్తున్నారు. నేపాల్–టిబెట్ సరిహద్దులోని త్రిశూల్, కేరాంగ్ నదుల తీరాలను ఆక్రమించి చైనా గ్యిరోంగ్ పోర్టు, ఇతర భవనాలు నిర్మించిందని వారు చెబుతున్నారు. హోలీశర్మ, ప్రచండ ప్రధానుల కాలంలో నేపాల్ ప్రభుత్వం చైనాకు పూర్తి సహకారం అందించిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ చెక్‌పాయింట్ ప్రాంతంలో భారీ నిర్మాణాలు వేగంగా జరిగాయి. శాటిలైట్ చిత్రాలలో నదుల సహజ ప్రవాహాలు మళ్లించబడినట్లు కనిపిస్తున్నాయని వాదనలు ఉన్నాయి.
హిమాలయాల్లోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో ఇలాంటి పెద్ద ఎత్తున నిర్మాణాలు భూమిని అస్థిరపరచి, వరద ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ప్రకృతిని కూడా శాసించగలం అన్న అహంకారంతో ఈ ప్రాంతాల్లో పనులు కొనసాగిస్తోందని విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే కారిడార్‌లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
సరిహద్దు అభివృద్ధి..
గ్యిరోంగ్ పోర్టు బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైన వాణిజ్య మార్గం. ఇది నేపాల్–చైనా వాణిజ్యాన్ని పెంచింది. కానీ హిమాలయాల్లో హిమానీనదాలు కరుగుతున్న నేపథ్యంలో, నదీ తీరాల్లో భవనాలు, రహదారులు నిర్మించడం ప్రమాదకరం. సహజ ప్రవాహాలను అడ్డుకోవడం లేదా మళ్లించడం వల్ల ఒక చిన్న హిమపాతం కూడా భారీ విపత్తుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నేపాల్‌కు మాత్రమే కాకుండా, దిగువ ప్రాంతాలైన భారత్‌పైనా ప్రభావం చూపుతుంది.
ఈ వరదలు సహజ విపత్తులకు మానవ కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయో చూపిస్తున్నాయి. చైనా తప్పించుకుంటున్నా.. శాటిలైట్ ఆధారాలు, స్థానిక అనుభవాలు చైనానే వేలెత్తి చూపిస్తున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశాలు పెద్ద శక్తులతో సరిహద్దు అభివృద్ధి ఒప్పందాలు చేసుకునేటప్పుడు పర్యావరణ అంచనాలను కఠినంగా పాటించాలి. హిమాలయాల్లో పారదర్శక సమాచార మార్పిడి, ఉమ్మడి పర్యవేక్షణ వ్యవస్థలు లేకపోతే ఇలాంటి విపత్తులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.