Nepal Natural Disaster : మన పొరుగు దేశం నేపాల్‌లో ఐదు రోజుల క్రితం ప్రకృతి ప్రకోపించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా.. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా బురదతో కూడిన వరద విరుచుకుపడింది. 2014 భూకంపానికి మించిన నష్టం కలిగించింది. వేలాది మందిని కబళించింది. లెక్కలేనంత మంది గల్లంతయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ వరదలకు కారణం చైనా అన్న అభిప్రాయం సగటు నేపాలీల్లో వ్యక్తమవుతోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ చైనా తమకు సంబంధం లేదు అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌కు సంబంధించిన ఒక కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ శాపమే ఆ దేశంలో ప్రకృతి విధ్వంసానికి కారణంగా చెప్పబడుతోంది.
ఏంటా కథ..?
17వ శతాబ్దంలో ఖాట్మండు లోయను పాలించిన మల్ల వంశ రాజుల కాలంలో అధికార పోరాటాలు సర్వసాధారణం. రాజు లక్ష్మీనరసింహ మల్లా సేవలో ఉన్న సేనాపతి భీమ్ మల్లా సైనిక, పరిపాలనా, వాణిజ్య వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాడు. పెరుగుతున్న ఇతని ప్రాభవం ఇతర సామంతుల్లో అసూయకు దారితీసింది. చాడీలు, అపోహలు రాజు మనసులో సందేహాలు నింపాయి. ఫలితంగా ఎలాంటి సరైన విచారణ లేకుండానే భీమ్ మల్లాకు మరణశిక్ష విధించబడింది.
భీమ్ మల్లా భార్య ఆత్మాహుతి..
భర్తను అన్యాయంగా ఉరితీయడాన్ని సహించలేక భువనలక్ష్మి నాటి సతి ఆచారం ప్రకారం చితిపై ఆత్మార్పణ చేసుకుంది. ఆ సమయంలో ఆమె రాజ్యం, నేలపై తీవ్ర కోపంతో శాపం పెట్టిందని జానపద కథనం చెబుతుంది. మనశ్శాంతి లేకుండా, విధ్వంసం ఎదురవుతుందని ఆమె అన్నట్లు ప్రచారం. రాజు తర్వాత పశ్చాత్తాపం చెందాడని, ఆ కాలంలోనే కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించాయని కథలు చెప్పుకుంటారు. ఈ సంఘటన నుంచే సతి లే సరాపేకో దేశ్ అనే పదబంధం పుట్టుకొచ్చిందంటారు.
ఇప్పటికీ వెంటాడుతుందా..
రాజరికం అంతమైన తర్వాత, ప్రభుత్వాలు తరచుగా కూలిపోయిన సందర్భాల్లో, రాజకీయ అస్థిరత తీవ్రమైనప్పుడు ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రకృతి ప్రకోపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం, భూకంపాలు సంభవించినప్పుడు కూడా ప్రజలు దీనిని గుర్తుచేసుకుంటారు. ఇది కేవలం చారిత్రక స్మృతి కాదు.. నేటి సమస్యలను వ్యంగ్యంగా, ఆవేదనతో వ్యక్తీకరించే సాధనంగా మారింది. తాజా జల విపత్తు మళ్లీ ఈ గాథను తెరపైకి తీసుకొచ్చింది.
ఈ కథ నేపాల్ సమాజంలో అన్యాయం, కుట్రలు, అధికార దుర్వినియోగంపై ఉన్న సామూహిక జ్ఞాపకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రకృతి విపత్తులు, రాజకీయ సంక్షోభాలు కలిసి వచ్చినప్పుడు ప్రజలు చారిత్రక శాపాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు నేపాల్ ప్రజలు ఇలాంటి కష్టాలను అలవాటు చేసుకుని తిరిగి నిలబడగలరని నమ్మకం వ్యక్తం చేస్తారు.
View this post on Instagram