Nepal floods: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ జల ప్రళయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నిమిషాల్లోనే నీరు, బురద గోడలా దూసుకొచ్చి భవనాలు, వంతెనలు, గ్రామాలను నాశనం చేసింది. అపార ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసం జరిగింది. పునరుద్ధరణకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ ఘటన హిమాలయ ప్రాంతంలోని గ్లేసియర్ ప్రమాదాలపై తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రళయం ఎలా సంభవించింది?
ఈ విపత్తు చైనా ఆక్రమిత టిబెట్ సరిహద్దు సమీపంలోని లెండే ఖోలా ప్రాంతంలో మొదలైంది. హిమనీ నదం లేదా ఐస్–రాక్ అవలాంచ్ కారణంగా నది తాత్కాలికంగా అడ్డుకుపోయి, ఆ తర్వాత బద్దలై నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. నేపాల్ సమయం ప్రకారం ఉదయం సుమారు 8:15 గంటలకు ఈ ఘటన జరిగి, 40–45 నిమిషాల్లోనే సరిహద్దు దాటి రసువా జిల్లా, భోటేకోషి, త్రిశూలి నదుల గుండా విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం అరగంటలోనే 7 నుంచి 9 మీటర్లు పెరిగింది. ఇది సాధారణ వర్షపు వరద కాదు.. గ్లేసియర్ లేక్ అవుట్‌బరస్ట్ ఫ్లడ్ లేదా ఇలాంటి హిమనీ కూలిపోవడం వల్ల కలిగిన ఫ్లాష్ ఫ్లడ్.
25 వేల గ్లేసియర్ లేక్‌లు..
హిమాలయాల్లో భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ వైపులా 25 వేల గ్లేసియర్ సరస్సులు ఉన్నాయి. వాతావరణ మార్పులతో మంచు కరగడం వల్ల ఇవి పెరుగుతూ, ఒక్కసారి బద్దలైతే 5–10 మీటర్ల ఎత్తు వరదలు, శిధిలాలతో కలిసి వినాశకరంగా మారతాయి. నేపాల్‌లో ఇటీవల కాలంలోనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.
భారత్ స్పందన, చైనాపై ప్రశ్నలు
ప్రళయం వార్తలు విన్న వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేన్ షాతో మాట్లాడి సర్వతోముఖ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిపుణులు, సామగ్రి పంపిణీ, అక్కడి భారతీయుల క్షేమం గురించి ఆరా తీశారు. భారత్ వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. దీనికి విరుద్ధంగా చైనా తీరుపై నేపాల్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రళయం మూలం సరిహద్దు సమీపంలోనే ఉండటం, సాంకేతిక సామర్థ్యం ఉన్నప్పటికీ సకాలంలో హెచ్చరిక ఇవ్వకపోవడం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రజలు, మీడియా, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చైనా సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలు, సెటిల్‌మెంట్లు నిర్మించడం వల్ల పర్యావరణ అసమతుల్యత ఏర్పడిందని, మంచు కరగడానికి దోహదపడిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. చైనా ఇలాంటి అనుబంధాలను తిరస్కరిస్తూ, సమాచారం అందిన వెంటనే సహాయం అందించామని చెబుతోంది. అయినా నేపాలీల్లో చైనా దోస్తీపై నిరాశ కనిపిస్తోంది. సంక్షోభ సమయంలో సకాల స్పందన లేకపోవడం ప్రధాన అంశం.
ఈ ప్రళయం కేవలం సహజ విపత్తు కాదు. వాతావరణ మార్పులు, హిమాలయాల్లోని అస్థిరత, సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయ లోపం కలిసి వచ్చిన పరిణామం. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సరిహద్దు దేశాల మధ్య సమాచార మార్పిడి, గ్లేసియర్ మానిటరింగ్ బలోపేతం అవసరం. భారత్ వెంటనే సహాయం అందించడం పొరుగు దేశాలతో సంబంధాల్లో మానవతా కోణాన్ని చూపించింది. నేపాల్‌లో చైనా పట్ల పెరుగుతున్న ప్రశ్నలు ప్రాంతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.