Bhogapuram Airport Inauguration: విజయనగరం జిల్లాలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించాయి. ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు.
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి భోగాపురం మండలంలోని ముంజేరు.. సవరవిల్లి.. ఏ రావివలస.. రావాడ.. కంచెరు.. కవులు వాడ.. గూడెపు వలస గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇచ్చారు. మొత్తంగా 403 మంది రైతులు భూములు ఇచ్చారు. 1600 మంది ఇల్లు ఇచ్చారు. కొంతమంది భూములు.. గృహాలు కూడా ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారు మొత్తం 200 మందికి పైగా ఉంటారు.
విమానాశ్రయ నిర్మాణానికి భూమి.. గృహాలు ఇచ్చిన వారికి ఏపీ ప్రభుత్వం సగౌరవాన్ని కల్పించబోతోంది. వారికి ప్రత్యేక అతిధులుగా గుర్తింపు ఇచ్చింది. ప్రధానమంత్రి కూర్చునే సభా వేదిక ఎదురుగా.. వి విఐపి లకు ఏర్పాటుచేసిన గ్యాలరీలో రైతులను ముందు వరుసలో కూర్చుండబెడుతుంది.. అంతేకాదు వారికి ఉత్తమమైన హాస్పిటాలిటీ అందించబోతోంది. దీనికి తోడు రైతులకు ఉచితంగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించబోతోంది.. రైతులను ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్ దాకా తీసుకెళ్తారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించడానికి ముందు.. నిర్మించిన తర్వాత.. చుట్టుపక్కల ప్రాంతంలో జరిగిన అభివృద్ధి.. ఇతర వ్యవహారాలను క్షేత్రస్థాయిలో చూపిస్తారు. వారికి అక్కడి పరిస్థితులను వివరిస్తారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో అత్యంత ఆధునికమైన పద్ధతులను పాటించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి మించి సౌకర్యాలు కల్పించారు. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం సాగిస్తారని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య దాదాపు 5కోట్లకు చేరుకుంటుందని.. తద్వారా భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తుంది. రోడ్ల కనెక్టివిటీ.. మౌలిక సదుపాయాలు.. ఇతర వ్యవహారాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం మెరుగైన పరిహారం ఇచ్చింది. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్ర వికాసానికి ప్రభుత్వతం సరికొత్త రెక్కలు తొడిగింది.