Telangana Congress: ఎన్నికలకు ముందు జూపల్లి కృష్ణారావు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వారికి ఆర్థిక బలం ఉంది కాబట్టి ఎన్నికల్లో గెలిచారు. అలా ఎన్నికల్లో గెలిచిన కొత్తవారు ఈసారి కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. కానీ వారందరినీ పక్కనపెట్టి కృష్ణారావుకు.. శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. శ్రీనివాసరెడ్డి చేతిలో అత్యంత కీలకమైన రెవెన్యూ.. సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది. కృష్ణారావు చేతిలో ఎక్సైజ్ శాఖ ఉంది. పార్టీలు మారి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడమే కాకుండా.. చివరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.
ఇవి కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా చేస్తున్న ఆరోపణలు. ఇందులో నిజం లేకపోలేదు. కాకపోతే పార్టీ భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించడం అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాతనే పార్టీ దూకుడు పెరిగింది. వేగం పెరిగింది. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కెసిఆర్ కొట్టిన దెబ్బలకు ఇంకొక పార్టీ అయితే లేచేది కాదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపి ఏకంగా పోటీలో నిలపాడు. అంతేకాదు కెసిఆర్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ నే అని నిరూపించాడు. బిజెపి గులాబీ పార్టీతో కలుస్తుంది అని ప్రచారం జరుగుతున్న వేళ.. ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకొని.. విజయం సాధించేలా చేశాడు రేవంత్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి దక్కుతున్న గౌరవాన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పార్టీలో వ్యక్తిగత ప్రజాస్వామ్యం కూడా అధికంగా ఉంటుంది. అందువల్లే నిత్యం పదవుల కోసం కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్తది కాకపోయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి.. భారతీయ జనతా పార్టీకి ఆయుధంగా మారింది. రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు కావడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతిని ఎగదోసి రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అనిరుద్ రెడ్డి.. అద్దంకి దయాకర్.. ఇంకా కొంతమంది నాయకులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అనేక రకాలుగా లాబీయింగ్ చేపట్టారు. చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇంకా చాలామంది నాయకులు.. పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కోరుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది ఆ నాయకులకు ఏమాత్రం లాభం చేకూర్చకపోగా.. కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనం కావడానికి కారణమవుతోంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలహీనమైపోతే.. ఇక జన్మలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కాకముందే కొంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడమే ఇంతటి పరిస్థితికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ముంచుకుపోయింది లేదని.. ఎందుకైనా మంచిది రేవంత్ రెడ్డి వాళ్లతో మాట్లాడి.. సమస్యలు పరిష్కరిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఈ ముసలం నుంచి బయటపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.