Hydra Ranganath: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో చెరువులు.. కుంటలు.. నాలాల ఆక్రమణ లేకుండా హైడ్రా అనే వ్యవస్థను తెరమీదకు తీసుకొచ్చారు. దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించారు.
రంగనాథ్ కు ముక్కుసూటిగా పని చేస్తారు అనే పేరు ఉంది. పైగా ఆయన గతంలో తెలంగాణలో అనేక ప్రాంతాలలో పోలీసు ఉన్నతాధికారిగా పని చేశారు. అనేక కీలకమైన కేసులను సాల్వ్ చేశారు. భూ అక్రమలకు పాల్పడే వ్యక్తుల గుండెల్లో నిద్రపోయారు. అంతటి కేసీఆర్ కూడా వరంగల్ లాంటి నగరానికి కమిషనర్ పోలీస్ గా రంగనాథ్ ను నియమించారు.
రంగనాథ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రాకు కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. అనేక చెరువులను రక్షించారు. కుంటలను బాగు చేశారు. నాలాలను పరిరక్షించారు. ఒక ముక్కలో చెప్పాలంటే విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. కోర్టుల ద్వారా కొంతమంది వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రంగనాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి బలమైన సపోర్టు లభిస్తుంది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ మళ్ళీ ప్రభుత్వం హైకోర్టులో వేరే బెంచ్ ను ఆశ్రయించడంతో రంగనాథ్ మీద వచ్చిన వ్యతిరేకత ఒక్కసారిగా పత్తా లేకుండా పోయింది.
రంగనాథ్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఒకటి చర్చకు దారి తీస్తోంది. హైదరాబాద్ నగరంలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి రంగనాధ్ హాజరయ్యారు. ఈ సమయంలో కూటమిలో ఉన్న నాయకులు మొత్తం హాజరు కావడం విశేషం. ఎంపీలు సానా సతీష్.. లక్ష్మణ్.. ఇంకా మున్నూరు కాపు సామాజిక వర్గంలో కీరకమైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వంటి వారి హాజరయ్యారు. దానికి రంగనాథ కూడా హాజరయ్యారు. వాస్తవానికి కుల సంఘాల సమావేశాలకు.. ఇతర భేటీలకు రంగనాథ్ హాజరవుతూనే ఉంటారు. ఈ విషయంలో ఆయన మీద విమర్శలు ఉన్నప్పటికీ పట్టించుకోరు. అయితే కూటమిలో ఉన్న ఎంపీలు. ఇతర నాయకులు హాజరైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రంగనాథ్ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఏపీలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పోలీసు అధికారులు రాజకీయ నాయకులుగా మారిన ఉదాహరణలు అనేక ఉన్నాయి. దీనికి రంగనాథ్ మినహాయింపు కాదు. పైగా రంగనాథ్ కు కూడా పొలిటికల్ లక్ష్యాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రకారం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో కూటమి లో ఉన్న ఏదో ఒక పార్టీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ను కలిశారు. చిరంజీవి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలో జనసేనలో చేరి.. ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమేనా.. ఊహగానామా అనేది త్వరలోనే తేలనుంది.