22A Telangana : డబ్బున్న వాడు ఏదైనా చేస్తాడు. ఎలాంటి అక్రమాలకైనా పాల్పడతాడు. వ్యవస్థలతో ఎలాగైనా ఆడుకుంటాడు. తనకు నచ్చింది చేస్తాడు. తనకు నచ్చిన దానికోసం ఎక్కడి దాకయినా వెళ్తాడు. కానీ పేదల విషయానికి వచ్చేసరికి మనదేశంలో అనేక నిబంధనలు ఉంటాయి. అనేక చట్టాలు ఉంటాయి.
హైదరాబాద్ నగరంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రఖ్యాత మీడియా సంస్థలలో పనిచేశాడు. ప్రస్తుతం కూడా పనిచేస్తూనే ఉన్నాడు. అతడు ప్రజాక్షేత్రంలో చాలా సంవత్సరాలు పాటు పని చేశాడు. ప్రజల సమస్యల మీద కథనాలు రూపొందించాడు. డేరింగ్ రిపోర్టింగ్ కు సిసలైన పర్యాయపదంగా నిలిచాడు. కానీ ఇప్పుడు అతడే సమస్యల్లో చిక్కుకున్నాడు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి.. ఇంట్లో ఉన్న బంగారం కుదువ పెట్టి.. 15 లక్షలు సమీకరించాడు. తన సేవింగ్స్ 25 లక్షలు మొత్తంగా 40 లక్షలతో ఒక ప్లాట్ కొనుక్కున్నాడు. తీరా రిజిస్ట్రేషన్ కి వెళ్లేసరికి.. అతడికి పిడుగు లాంటి వార్త ఎదురైంది. అతడు కొనుగోలు చేసిన ఆస్తి నిషేధిత జాబితాలో ఉందట. దీంతో రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని చెప్పేశారు రిజిస్టర్.
ఈ నేపథ్యంలో తాను ప్లాటు కొనుగోలు చేసిన యజమాని నియమించుకున్న న్యాయవాది ద్వారా జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాడు. ఈ ప్లాటును 22a చట్టం పరిధి నుంచి మినహాయించాలని కోరాడు. వాస్తవానికి 22 ఏ చట్టం వల్ల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఎంతవరకు సాగుతుందో తెలియదు గానీ.. సామాన్యులకు మాత్రం. 22a అనేది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ.. దేవాదాయ.. అసైన్డ్.. సీలింగ్…వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం ఉద్దేశం గొప్పది అయినప్పటికీ.. దీనిని అమలు చేసే విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెవెన్యూ రికార్డులలో లోపాలు.. అధికారుల నిర్లక్ష్యం.. వంటి కారణాల వల్ల సామాన్యులు.. మధ్యతరగతి వాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ చట్టం వల్ల సదరు భూమి నిషేధిత జాబితాలో చేరితే.. రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల కొనుగోలు.. అమ్మకాలు.. గిఫ్ట్ డీడ్.. లీజులు నిర్వహించడం సాధ్యం కాదు. రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఒక సర్వే నెంబర్ లో కొంత భాగంలో ప్రభుత్వ భూమి గనుక ఉంటే దానిని మొత్తాన్ని 22ఏలో చేర్చారు. దీనివల్ల ఆ భూమి మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్తోంది. చట్టబద్ధమైన పత్రాలతో దశాబ్దాలుగా ఆ ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ.. యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు..
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపల్ అనుమతులు ఉన్నప్పటికీ.. లే అవుట్ అప్రూవల్స్.. ఆక్యుపెన్సి వంటి ధ్రువపత్రాలను కలిగి ఉన్నప్పటికీ.. ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ.. అకస్మాత్తుగా 22a పరిధిలోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఆస్తులను అమ్ముకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే ఈ చట్టాన్ని సమీక్షించాలని.. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలని మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై రేవంత్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.