2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ మీద గెలిచి.. ఖైరతాబాద్ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికై.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా మారిపోయారు దానం నాగేందర్. పైగా ఆయన 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. చివరికి ఓడిపోయారు.
దానం నాగేందర్ ప్రస్తుతం రాజకీయంగా సంకటమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ వేదికగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నుంచి ఆశించిన స్థాయిలో సపోర్టు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే పెద్దపెద్ద కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు.
దానం నాగేందర్ కు అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ 500 ఐటి సంస్థ ఇన్ఫినిట్ అధినేత సంజయ్ గోయల్ కు ఫ్రెండ్షిప్ ఉంది. ఈయన హైదరాబాద్.. తెలంగాణ ప్రాంతాలలో తన కార్యాలయాలను విస్తరించాలని కోరుకున్నారు. ప్రభుత్వం సరైన స్థాయిలో సపోర్ట్ ఇవ్వకపోవడంతో.. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించే తన ఆలోచనను ఆయన విరమించుకున్నారు.
“నా ఫ్రెండ్ తన సంస్థ విస్తరణ కోసం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన ప్రతిసారి నిరాశతోనే వెనక్కి వెళ్ళిపోయాడు. వచ్చినందుకు చాయ్, కాఫీ తాగితే వచ్చింది. ఎంపిక చేసిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. భూముల కేటాయింపులో నిబంధనలు పాటించాలి. అనుమతులలో పారదర్శకత ఉండాలని” దానం నాగేందర్ వ్యాఖ్యానించారు..
నాగేందర్ ఉద్దేశించి ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబునే అని తెలుస్తోంది. నాగేందర్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే శ్రీధర్ బాబు ఉన్నారు. ఆయనను నిలిపివేసే ప్రయత్నం చేసినప్పటికీ తగ్గలేదు. తన ఆవేదనను బహుమటలు లేకుండా బయట పెట్టుకున్నారు. నాగేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫార్చ్యూన్ 500 స్థాయి కంపెనీ అధినేతను తెలంగాణకు తీసుకొస్తే.. ప్రభుత్వం పట్టించుకోలేదనే అపవాదు తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దావోస్.. లండన్.. అమెరికా వెళ్తున్నారు. పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో.. గులాబీ పార్టీకి అనుకోని ఆయుధం లాగా మారిపోయింది. మరి దీనిపట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ విషయంలో దానం నాగేందర్ కు రేవంత్ రెడ్డి ఫేవర్ గా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాగేందర్ వ్యాఖ్యలకు ఇప్పటికే గులాబీ పార్టీ మీడియా విపరీతంగా ప్రయారిటీ ఇచ్చింది. ఈ లెక్కన ఇదే అంశం మీద రేవంత్ ను గులాబీ మీడియా కొద్ది రోజుల పాటు తిట్టిపోయడం గ్యారెంటీ.