Konda Surekha: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ముదిరి పాకానపడ్డాయి.. మొన్నటిదాకా కర్ణాటక రాజకీయాలు.. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. కేసి వేణుగోపాల్.. ఇతర సీనియర్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతూనే ఉన్నారు. మొత్తానికి కొండా సురేఖ మీద వెయిట్ వేయాలని ఆయన బలంగా బల్ల గుద్ది చెబుతున్నారు. చిన్నారెడ్డి విషయంలో కూడా ఉపేక్షకు తావు లేదని.. కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే చివరికి ఇలా చేస్తున్నారని రేవంత్ రెడ్డి వాపోయినట్టు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అభిప్రాయంతో అధిష్టానం కూడా ఏకీభవించినట్టు సమాచారం.
సీనియర్ మంత్రులు.. ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. కొండా సురేఖ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన మనసులో ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల కొండా సురేఖ బంగారు రాఖీ తయారు చేయించి రేవంత్ రెడ్డి కట్టారు. తన మధ్య అపారమైన బంధం ఉందని చెప్పుకొచ్చారు. కానీ అదంతా మీడియాలో పబ్లిసిటీ కోసం మాత్రమేనని.. బయటికి ఏమో నవ్వులు.. లోపల పదునైన కత్తులు ఉన్నాయని సురేఖ చెప్పకనే చెప్పారు. ఇటీవల మహబూబాబాద్ లో జరిగిన సభలో ఉమ్మడి జిల్లా మంత్రిగా కొండా సురేఖ పేరును శిలాఫలకం మీద ఏర్పాటు చేయలేదు. కొండా సురేఖ ఫోటోలు ఫ్లెక్సీ మీద ముద్రించలేదు. దీంతో కొండా సురేఖకు ఉద్వాసన తప్పదు అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
కొండా సురేఖను పదవి నుంచి తొలగించకుండా ఉండేందుకు ఆమె భర్త మురళి తనవంతు ప్రయత్నాలు చేశారు. కొంతమంది మంత్రులు కూడా సురేఖకు సపోర్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఏవి ఎలా ఉన్నా సరే సురేఖకు పదవి దూరమవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్న సురేఖ అక్కడ విలేకరులతో కీలక వ్యాఖ్యలు చేశారు.
తనను రాజీనామా చేయాలని అంటున్నారని.. తన రాజీనామా కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సురేఖ సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తానే మరో కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా చెప్తారని.. రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొంతమంది మంత్రుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. వారంతా కూడా అసంతృప్తిలో ఉన్నారని సురేఖ వ్యాఖ్యానించారు. తన రాజీనామా వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని.. దానికి తొందర ఏమీ లేదని సురేఖ వ్యాఖ్యానించారు.
చూడబోతే ముఖ్యమంత్రి మీద తన కుమార్తె చేసినట్టుగానే.. సురేఖ కూడా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కొండ దంపతులకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో జగన్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఇదే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా ఇదే స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా ఇదే స్థాయిలో మాట్లాడారు. ఇప్పుడు కొండా సురేఖ ఇలా మాట్లాడటం తమకు ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.