nandi awards 2026 : తెలుగు సినీ పరిశ్రమ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నంది అవార్డులు మళ్లీ తెరపైకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక నంది అవార్డుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. దీంతో సంవత్సరాలుగా నిలిచిపోయిన నంది అవార్డుల ప్రక్రియకు మళ్లీ కదలిక వచ్చింది.
తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో నంది అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తమ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. అయితే కొంతకాలంగా నంది అవార్డుల ప్రదానోత్సవాలు జరగకపోవడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రముఖుల్లో ఉత్సాహం నెలకొంది.
2012 నుంచి 2016 వరకు పెండింగ్‌లో ఉన్న నంది, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని నవంబర్‌లో విజయవాడలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి సంబంధించిన ఎంపిక చేసిన అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీటితో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డులను కూడా ఈ ప్రక్రియలో భాగంగా ప్రకటించనున్నారు.
నంది చలనచిత్ర అవార్డుల కోసం అమరావతి లేదా విజయవాడలో ప్రత్యేకంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నంది టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ రెండు కార్యక్రమాలు 2026 డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అవార్డుల ఎంపిక కోసం ప్రత్యేక జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. నవంబర్‌లో జ్యూరీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. 2017 నుంచి 2024 వరకు, అలాగే 2025 సంవత్సరానికి సంబంధించిన విజేతల జాబితాను కూడా నవంబర్‌లోనే ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వివరాల ప్రకారం చలనచిత్ర విభాగంలో మొత్తం 46 అవార్డులను అందించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, సహాయ నటీనటులు, ఇతర సాంకేతిక విభాగాలతో పాటు ప్రత్యేక గుర్తింపులకు కూడా పురస్కారాలు ఉండనున్నాయి.
ఏళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల పునరాగమనం తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి సందడి తీసుకురానుంది. జ్యూరీ సభ్యుల ఎంపిక, అవార్డుల కోసం పరిశీలించే చిత్రాలు, విజేతల జాబితా, చివరగా జరగబోయే భారీ ప్రదానోత్సవంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నంది అవార్డులు తిరిగి ప్రారంభమవుతుండటంతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు, అభిమానులు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.