Honda QC3 : జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. Honda QC3 పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధరను రూ.1.35 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. ఇప్పటికే QC1, Activa e: మోడళ్లను అందిస్తున్న హోండా.. QC3తో భారత ఈవీ విభాగంలో తన ఉనికిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
145 కిలోమీటర్ల రేంజ్
హోండా QC3లో 3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీతో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల IDC సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల సమయం అవసరం.
QC1తో పోలిస్తే QC3 బ్యాటరీ సామర్థ్యం రెట్టింపు కావడం గమనార్హం. QC1లో 1.5kWh బ్యాటరీ ఉండగా, 80 శాతం ఛార్జ్‌కు 4 గంటల 30 నిమిషాలు, పూర్తి ఛార్జ్‌కు 6 గంటల 50 నిమిషాలు పడుతుంది.
32 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్
రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని QC3లో 32 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ అందించారు. QC1లో ఉన్న 26 లీటర్లతో పోలిస్తే ఇది 6 లీటర్లు ఎక్కువ. స్కూటర్‌లో 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇందులో Honda RoadSync కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Smart Keyను కూడా స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
QC3లో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌ను అందించారు.
నాలుగు రంగుల్లో లభ్యం
Honda QC3ను Matt Photon Gray Metallic, Pearl Precious White, Pearl Shallow Blue, Pearl Siren Blue అనే నాలుగు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఈ స్కూటర్ విక్రయాలు ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లం నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. RedWing డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.5,000 చెల్లించి హోండా వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. అయితే డెలివరీ తేదీలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ప్రధాన ప్రత్యర్థులు వీళ్లే
రూ.1.35 లక్షల ధరతో వచ్చిన Honda QC3కు మార్కెట్లో TVS iQube 3.1kWh (రూ.1.30 లక్షలు), Ather Konarc S 161 (రూ.1.45 లక్షలు), Bajaj Chetak C3502 (రూ.1.44 లక్షలు) వంటి మోడళ్లు పోటీగా ఉన్నాయి. మరోవైపు Hero Vida VX2 Plus 3.1 రూ.1.03 లక్షల ధరతో ఈ జాబితాలో మరింత అందుబాటు ధరలో ఉన్న ఆప్షన్‌గా నిలుస్తోంది.
స్థానిక తయారీ కారణంగా QC3ను పోటీ ధరలో అందిస్తున్నామని హోండా చెబుతోంది. 3kWh బ్యాటరీ, 145 కిలోమీటర్ల రేంజ్, అధిక స్టోరేజ్, కనెక్టెడ్ ఫీచర్లతో QC3 భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హోండాకు కీలక మోడల్‌గా మారనుంది.